భారతమాత అంటూ దేశాన్ని తల్లిలా భావించే దేశంలో.. అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోంది. బయటకు వెళ్లింది మొదలు ఇంటికి వచ్చేవరకు భయంతో బిక్కుబిక్కుమంటూ అడుగులు వేయాల్సిన పరిస్థితి. ఆగంతుకుడు, పరిచయస్థుడు, బంధువు.. ఇలా ఎవరి రూపంలో మృగాడు దాగున్నాడో? అని అనుక్షణం 'భయం'కరమైన మానసిక క్షోభ అనుభవించాల్సిన దుస్థితి. అత్యాచారానికి యత్నించడం.. కాదంటే కిరోసిన్ పోసి కాల్చేయడం.. ప్రతిఘటిస్తే కత్తితో పొడవడం.. ఎదురు తిరిగితే చావబాదడం. ఇవీ.. ఉత్తర్‌ప్రదేశ్‌లో బుధవారం ఒక్కరోజే వెలుగులోకి వచ్చిన ఘోరాలు.
కుమార్తెపై అత్యాచారం జరిగినా భయంతో పోలీసులకు చెప్పలేదని ఓ తండ్రి వాపోవడం పరిస్థితి ఎంతలా దిగజారిందో తెలియజేస్తోంది. ఇక కేరళలో ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహాన్ని నటించిన ఏడుగురు వ్యక్తులు బాలికకు మాదకద్రవ్యాలు ఇచ్చి దారుణానికి ఒడిగట్టారు. గుంటూరు జిల్లాలో ఒకరితో కాస్తంత చనువుగా ఉండడమే ఓ యువతి పాలిట మరణ శాసనమైంది.
కిరోసిన్ పోసి కాల్చేశారు..
తనపై తొలుత సామూహిక అత్యాచారానికి యత్నించారని, ప్రతిఘటించడంతో నిప్పు పెట్టి హత్య చేసేందుకు ప్రయత్నించారని ‘షాజహాన్‌పుర్’ బాధితురాలు బుధవారం పోలీసులకు తెలిపారు. కళాశాల నుంచి ఇంటికి బయలుదేరిన ఈ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఒంటి నిండా కాలిన గాయాలతో, నగ్నంగా లఖ్‌నవూ-బరేలీ జాతీయ రహదారి పక్కన అచేతనావస్థలో కనిపించిన దిగ్భ్రాంతికర ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్‌లో సోమవారం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రాయ్ ఖెడా గ్రామం సమీపంలో సోమవారం ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, బాధితురాలికి 72 శాతం కాలిన గాయాలయ్యాయని లఖ్‌నవూలోని శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆసుపత్రి డైరెక్టర్ ఎస్సీ సౌంద్రియాల్ చెప్పారు.
గుంటూరు జిల్లాలో దారుణం
గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన కోట అనూష అనే యువతికి, బొల్లాపల్లి మండలం పమిడిపాడుకు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డికి కొన్నాళ్లుగా పరిచయం ఉంది. ఇటీవల అనూష మరో అబ్బాయితో కాస్తంత కలివిడిగా మాట్లాడుతోంది. ఈ విషయమై బుధవారం ఇద్దరి మధ్య మాటమాటా పెరిగింది. చివరకు ఆమె ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
భయపడి పోలీసులకే చెప్పలేదు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హమీర్పుర్ పట్టణంలో రెండు రోజుల క్రితం అత్యాచారానికి గురైన 17 ఏళ్ల యువతి బుధవారం కన్నుమూసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. బాధితురాలి మరణం తర్వాత ఆమె తండ్రి పెదవి విప్పారు. తన కుమార్తెపై సోమవారం ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారని, భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని వాపోయారు.