Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా భీకరదాడితో ప్రపంచానికి అనేక నిజాలు తేటతెల్లమవుతున్నాయి. సార్వభౌమాధికారం, స్వేచ్ఛ అనేవి ప్రతి దేశానికి ప్రాథమిక హక్కులుగా ఉంటాయి. పొరుగుదేశాలతో శాంతిగా వ్యవహరించాలి. ఒక వేళ పొరుగుదేశాలు ధూర్త దేశాలుగా ఉంటే వారికి శాంతి ప్రవచనాలు పనిచేయవు. వారు మన వైపు కన్నెత్తి చూడకుండా ఉండాలంటే మన సైనికశక్తిని అజేయంగా పెంచుకోవాలి.
- సైనిక రంగంలో వస్తున్న అధునాతన యుద్ధ తంత్రాన్ని ఎప్పటికప్పుడు అలవరుచుకోవాలి. ఏదేశమో, ఏ అగ్రరాజ్యమో ఆదుకుంటుందని ఎదురు చూడకూడదని ఉక్రెయిన్ ఉదంతం ఉదాహరణగా నిలిచింది.
- గతంలో అమెరికా, నాటో కూటమి ఇచ్చిన హామీలను విశ్వసించిన జార్జియా ఘటన తెలిసిందే. తాజాగా ఉక్రెయిన్ కూడా ఇతర దేశాల మాటలు విశ్వసించి తన దగ్గర ఉన్న అణ్వాయుధాలను నిర్వీర్యం చేసింది.
- ఒక వేళ అణుశక్తి ఉంటే దాడులు చేయాలా.. వద్దా? అని రష్యా ఒకటికి వందసార్లు ఆలోచించి ఉండేది. సైనిక సాయం చేస్తామన్న ఇతర దేశాలను సమకాలీన ప్రపంచంలో విశ్వసించని పరిస్థితి ఏర్పడింది.
- సూపర్ పవర్ దేశాలు కూడా యుద్ధం సమయంలో బాధిత దేశాలకు సాయం చేసేందుకు వెనుకా ముందు ఆలోచిస్తాయి.
- యుద్ధం అంటే ఆర్థికంగా భారం. ఇరాక్, అఫ్గాన్ యుద్దాల ద్వారా అమెరికా సాధించింది శూన్యం. పైగా ఆర్థికంగా బలహీనపడింది.
- తాజాగా ఉక్రెయిన్‌పై జరుగుతున్న దాడిలో రష్యాకు రోజుకు ఏకంగా 10 బిలియన్ డాలర్ల వరకూ ఖర్చవుతోంది.
అప్రమత్తంగా ఉండాల్సిందే..
ఇక మన దేశం విషయానికొస్తే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో ఉన్నాం. ఒక వైపు పాకిస్థాన్, మరో వైపు చైనాలు అణ్వాయుధ దేశాలు కావడం గమనార్హం. విపత్కర సమయాల్లో రెండు దేశాలతో యుద్దం చేయాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశాలున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని భారత్ పెద్ద ఎత్తున రక్షణరంగానికి నిధులు కేటాయించాలి. సైనిక బలగాలను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అధునాతన యుద్ధరీతితో పాటు యుద్ధతంత్రాన్ని అమలు చేయాల్సిన అవసరముంది.
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మనదేశం శాంతికాముకంగా ఉంది. అయితే పాకిస్థాన్, చైనాలు మనతో నిత్యం గిల్లికజ్జాలకు దిగుతుండటం తెలిసిందే. అయితే మనది అణుపాటవమున్న దేశం కావడం వల్ల మన దేశంపై పూర్తిస్థాయి యుద్ధానికి దిగే పరిస్థితులు లేవు. అయినా భౌగోళికంగా మనకున్న ఆందోళనల దృష్ట్యా ఎప్పటికప్పుడు మన సాంకేతిక పరిజ్ఞానాన్ని సైన్యంలో ప్రవేశపెట్టాలి. ఇది నిరంతర ప్రక్రియగా ఉండాలని రక్షణ నిపుణుల సూచన. దీంతో పాటు మూడు వైపులా సముద్రతీరం కలిగిన విశిష్టత మనకు ఉంది. సముద్రంపై మన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం సహా చైనాపై పైచేయి సాధించాలంటే యుద్ధనౌకలను మరింతగా పెంచాలి. అదే రీతిలో వైమానిక బలగాన్ని పెంచుకోవాలి.
స్వీయరక్షణతో భద్రత