Punjab Election 2022: అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్ రాజకీయాల్లో నేతల వలసలు వెల్లువెత్తాయి. అనేకమంది ప్రముఖ నాయకులు సొంత పార్టీలకు గుడ్‌బై చెప్పి ఇతర పక్షాల్లో చేరిపోయారు. తామున్న పార్టీ ఈ దఫా ఎన్నికల్లో బలహీనంగా కనిపిస్తోందన్న ఆందోళన, టికెట్ దక్కకపోవడం, కోరుకున్న స్థానం నుంచి బరిలో దిగే అవకాశం చిక్కకపోవడం.. ఇలా ఒక్కొక్కరి ఫిరాయింపునకు ఒక్కో కారణముంది. వీరిలో కొంతమంది ఇతర పార్టీల్లోకి వెళ్లి టికెట్ దక్కించుకున్నారు. మరికొంతమంది పరిస్థితి మాత్రం.. రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది! కొత్తగా చేరిన పార్టీలోనూ వారికి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో తాజా అసెంబ్లీ ఎన్నికలు సమీపించినప్పటి నుంచి రాష్ట్రంలో కీలక నేతల ఫిరాయింపు వివరాలను పరిశీలిస్తే..
కాంగ్రెస్: అమరీందర్ సహా పలువురు సీనియర్లు..
మాజీ సీఎం అమరీందర్ సింగ్ హస్తం పార్టీని వీడి.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్‌సీ) పేరుతో సొంత పార్టీని స్థాపించడం అత్యంత కీలక పరిణామం. మరికొందరు సీనియర్ నేతలు కమలదళం సహా ఇతర పార్టీల గూటికి చేరారు. వారిలో రాణా గుర్మీత్‌సింగ్ సోఢీ, ఫతేజంగ్‌సింగ్ బజ్వా ముఖ్యులు. వీరిద్దరూ కాషాయ కండువా కప్పుకొన్నారు. మరో బడా నాయకుడు బల్వీందర్‌సింగ్ లాడీ కూడా కమలం గూటికి వెళ్లినా, తిరిగి వెనక్కి వచ్చేశారు. అయితే కాంగ్రెస్‌లోనూ ఆయనకు టికెట్ దక్కలేదు. మరో ప్రముఖ నేత సుఖ్‌జిందర్‌రాజ్‌సింగ్ అలియాస్ లాలీ మజీఠియా, మాజీ మంత్రి జగ్‌మోహన్‌సింగ్ కాంగ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తీర్థం పుచ్చుకున్నారు. భాజపాలో గుర్మీత్‌సింగ్ సోఢీకి ఫిరోజ్‌పుర్ నగర, ఫతేజంగ్ బజ్వాకు బటాలా టికెట్ దక్కాయి. సుఖ్‌జిందర్‌రాజ్‌సింగ్‌ను ఆప్ మజీఠా స్థానం నుంచి బరిలో దింపింది. జగ్‌మోహన్‌సింగ్‌కు మొండిచేయి చూపింది. కాంగ్రెస్ నుంచి వచ్చిన గాయకుడు బల్కర్ సిద్ధూకు రాంపుర ఫూల్, గుర్మీత్‌సింగ్ ఖుదైన్‌కు లంబీ టికెట్లను ఆప్ కేటాయించింది. హస్తం పార్టీ నుంచి ఫిరాయించిన హర్‌జిందర్‌సింగ్ టెకెదార్ పీఎల్‌సీ తరఫున అమృత్‌సర్ (దక్షిణ) సీటు నుంచి పోటీ చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు హెచ్‌ఎస్ హన్స్‌పాల్ కూడా ఆప్‌లో చేరడం గమనార్హం.
ఆమ్ ఆద్మీ పార్టీ : ఎమ్మెల్యేల ఫిరాయింపుతో కుదేలు
2017 అసెంబ్లీ ఎన్నికల్లో 20 సీట్లు దక్కించుకొని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన ఆప్.. ఆ తర్వాత వలసలతో కుదేలైంది. ఎమ్మెల్యేలు హెచ్‌ఎస్ ఫూల్కా, సుఖ్‌పాల్ ఖైరా, కన్వర్ సంధూ, నాజర్‌సింగ్ మానశాహియా, జగ్‌దేవ్‌సింగ్ జగ్గా హిసోవాల్, అమర్‌జీత్‌సింగ్ సందోవా, రూపిందర్‌కౌర్ రూబీ, పిర్మల్‌సింగ్ దౌలా, జగ్దేవ్‌సింగ్ కమాలూ పార్టీకి గుడ్‌బై చెప్పి.. కాంగ్రెస్‌లో చేరారు. రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు గుర్‌ప్రీత్‌సింగ్ ఘుగ్గీ, మోహన్‌సింగ్ ఫలియాన్‌వాలా సహా మరికొందరు ప్రముఖులూ వెళ్లిపోయారు. ఆప్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల్లో సుఖ్‌పాల్ ఖైరా, జగ్‌దేవ్‌సింగ్ జగ్గా, రూపిందర్‌కౌర్ రూబీ మాత్రమే ప్రస్తుతం హస్తం పార్టీ టికెట్లు దక్కించుకున్నారు. మోహన్‌సింగ్ ఫలియన్‌వాలాను జలాలాబాద్‌లో బరిలో దించింది కాంగ్రెస్.