Flag code of India: భారత జాతీయ జెండా దేశానికి గర్వకారణం. భారతీయులు అందరూ గౌరవించే పతాకం. ఆ నిబద్ధతను శ్రద్ధాసక్తులతో నిర్వహించడం ప్రత్యేక బాధ్యత. జాతీయ దినోత్సవాలు, ప్రభుత్వ వేడుకల్లో జాతీయ జెండా ఎగురవేస్తున్నారు. ప్రస్తుతం ఇంటింటా తిరంగ కార్యక్రమంలో భాగంగా అందరూ తమ ఇళ్లపై జెండాలు ఎగురవేస్తున్నారు. అయితే, జెండాను ఉపయోగించే సందర్భాల్లో పాటించే పద్ధతుల్లో జరిగే పొరపాట్లు, తప్పులు, ఉల్లంఘనలకు పాల్పడకూడదు. అలా చేస్తే చట్ట ప్రకారం శిక్షార్హం అవుతుంది. అందుకే జెండా వందనం సందర్భంలో చేయవలసిన, చేయకూడని విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. జాతీయ జెండా ఎగురవేయడానికి సంబంధించి.. 2002లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్‌లోని ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు.
- జాతీయ జెండా ఎగురవేసినప్పుడు కాషాయ వర్ణం పైకి వచ్చేలా జాగ్రత్త తీసుకోవాలి
- జెండాను పై నుంచి కిందికి వేలాడదీయకూడదు
- పతాకానికి సమానంగా గానీ, ఇంకా ఎత్తులో గానీ ఏ ఇతర జెండా ఎగురకూడదు
- జెండాపై ఏదైనా రాయడం, తయారు చేయడం, జెండా నుంచి ఏదైనా తొలగించడం చట్ట విరుద్ధం
- జాతీయ పతాకాన్ని ఏ వస్తువులను, భవనాలను మొదలైన వాటిని కవర్ చేయడానికి ఉపయోగించకూడదు
- ఉద్దేశపూర్వకంగా నేలపై లేదా నీటిలో, కాలిబాటలో వేయరాదు
- యూనిఫాం, అలంకరణ కోసం ఉపయోగించకూడదు
- హాని కలిగించే విధంగా దానిని ప్రదర్శించకూడదు, కట్టకూడదు.
- పోల్‌కు చిట్ట చివరనే ఎగురవేయాలి, సగం కిందకు దించి ఎగురవేయకూడదు
- దెబ్బతిన్న, చెదిరిన జెండాను ప్రదర్శించకూడదు.
- ఫ్లాగ్ కోడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష కూడా విధించవచ్చు.
- త్రివర్ణ పతాకం జాతీయ గౌరవానికి చిహ్నం. దానిని వాణిజ్యపరంగా ఉపయోగించకూడదు. ముఖ్యంగా జెండాపై అగౌరవాన్ని వ్యక్తం చేయకూడదు.