West Bengal Train Accident : బంగాల్‌లోని బంకురా జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. ఓండా స్టేషన్‌కు సమీపంలో రైల్వే మెయింటెనెన్స్ రైలు, ఓ గూడ్స్ రైలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12పైగా బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు ఇంజిన్.. మరో బోగీపైకి చేరింది. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైల్వే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో గూడ్స్ రైలు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటనపై సౌత్ ఈస్టర్న్ రైల్వే స్పందించింది. ఆదివారం తెల్లవారుజామున 4.5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపింది. 'ఓండా రైల్వే స్టేషన్లో రైల్వే మెయింటెనెన్స్ ట్రైన్ (BRN) షంటింగ్ జరుగుతున్న సమయంలో ఓ గూడ్స్ రైలు (BCN) రెడ్ సిగ్నల్ ఉన్నా ఆగకుండా.. మెయింటెనెన్స్ రైలుతో ఢీకొట్టి పట్టాలు తప్పింది. ఈ మార్గంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. అప్ మెయిల్ లైన్, అప్ లూప్ లైన్‌ను పునరుద్ధరించాము' అని సౌత్ ఈస్టర్న్ రైల్వే తెలిపింది. ఈ ప్రమాదం కారణంగా 14 రైళ్లను రద్దు చేశారు. 3 రైళ్లను దారి మళ్లించారు.
Odisha Train Tragedy : జూన్ 2న ఒడిశాలోని బాలేశ్వర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బహానగా రైల్వే స్టేషన్లో లూప్ లైన్‌లో నిలిపి ఉంచిన గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బలంగా ఢీకొట్టింది. దీంతో రైలు బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయాయి. పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు పక్క ట్రాక్‌పై పడ్డాయి. దీంతో అటువైపుగా వస్తున్న బెంగళూరు-హవ్‌డా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ చివరి బోగీలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 288 మంది మరణించారు. 1,200 మందికి పైగా గాయాలపాలయ్యారు.
ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌ను తారుమారు చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బాలేశ్వర్ రైలు ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. అనంతరం రంగంలోకి దిగిన సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. దర్యాప్తు ఇటీవల కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా బాలాసోర్ సిగ్నల్ జేఈ అమీర్‌ఖాన్ అద్దె ఇంటికి ఇటీవల సీల్ వేసిన సీబీఐ అధికారులు.. అతడి సమక్షంలోనే ఆ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఇంతకుముందు అమీర్ ఖాన్‌ను రహస్య ప్రాంతానికి తరలించి సుదీర్ఘంగా విచారించారు. ఇలాంటి కీలకమైన విధుల్లో ఉన్న జేఈ అమీర్ ఖాన్ ఇంటిని సీబీఐ అధికారులు సీల్ చేయడం ఆసక్తి రేపింది.