బంగాల్ ప్రభుత్వం గతనెలలో ప్రారంభించిన 'స్టూడెంట్ క్రెడిట్ కార్డ్(ఎస్సీసీ)' పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. వారం రోజుల్లోనే 26,000 అప్లికేషన్లు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో 6,059 మంది రాష్ట్రం వెలుపల చదవుతున్నారని వెల్లడించింది.
'ఈ పథకం విజయవంతమైంది. రాబోయే రోజుల్లో మరిన్ని దరఖాస్తులు స్వీకరించే యోచనలో ప్రభుత్వం ఉంది.' అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
రూ.10లక్షల వరకు..
బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జూన్ 30న ఈ పథకాన్ని ప్రారంభించారు. నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు దీనిని రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్డు ఉన్నవారు రూ.10 లక్షల వరకు సులభతరమైన రుణాలు పొందవచ్చు. పదో తరగతి నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్థులు.. ఈ క్రెడిట్ కార్డుతో లబ్ధి పొందవచ్చు. ఎంబీబీఎస్, బీ.టెక్, డిప్లొమా కోర్సులు వంటి నైపుణ్య ఆధారిత కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు సైతం ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పథకం కింద.. ఒక విద్యార్థి తాను చదవాలనుకుంటున్న కోర్సుకు సంబంధించి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఇప్పటికే ఫీజు చెల్లిస్తే అప్లై చేసుకునే వీలులేదు.
రాష్ట్ర ప్రభుత్వం హామీదారుగా ఉన్నందున విద్యార్థులు ఎటువంటి ష్యూరిటీని ఇవ్వాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఉన్నత విద్య అభ్యసనంతో పాటు.. ల్యాప్‌టాప్‌లు, పుస్తకాలు కొనేందుకు, ట్యూషన్, హాస్టల్ ఫీజులు చెల్లించేందుకు సైతం ఈ రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఇవీ చదవండి: