దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో శాసనసభ ఎన్నికలు జరగనుండగా యావత్ భారతదేశం దృష్టిని ప్రధానంగా ఆకర్షిస్తున్నవి బంగాల్ ఎన్నికలే. అలాంటి బంగాల్‌లో శనివారం తొలి విడత పోలింగ్ జరగనుంది. 8 విడతల సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో శనివారం తొలి అడుగు పడనుంది. బంగాల్ శాసనసభలో 294 స్థానాలు ఉండగా, తొలి దశలో 30 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. 191 మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. వీరిలో 21 మంది మహిళలు ఉన్నారు. తొలి విడత పోలింగ్ కోసం 10వేల 288 పోలింగ్ బూత్‌లను ఈసీ ఏర్పాటు చేసింది.
పటిష్ట భద్రత
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. తొలి దశ ఎన్నికలు జరిగే నియోజకవర్గాలు ఎక్కువగా ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి. పురులియా, ఝార్‌గామ్ జిల్లాల్లోని అన్ని స్థానాలు, బంకుర, మేదినిపుర్, పశ్చిమ మేదినీపుర్, పుర్బా జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2016 శాసనసభ ఎన్నికల్లో ఈ 30 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఏకంగా 27 స్థానాలను కైవసం చేసుకుని ఏకపక్ష ఫలితాలను సాధించింది. ఈ సారి మాత్రం తృణమూల్‌కు పరిస్థితి నల్లేరు మీద బండి నడకలా లేదు. భాజపా రూపంలో తృణమూల్‌కు గట్టి ప్రత్యర్థి ఎదురుగా నిలిచింది. 2016 ఎన్నికల్లో బంగాల్‌లో భాజపా పాత్ర నామమాత్రంగా ఉండగా ఈ అయిదేళ్లలో ఆ పార్టీ తృణమూల్‌కు బలమైన ప్రత్యామ్నాయంగా మారింది. ఒకప్పుడు బంగాల్‌లో బలంగా ఉన్న వామపక్షాల స్థానాన్ని ఆక్రమించి భాజపా ఈ ఎన్నికల్లో తృణమూల్‌కు గట్టి సవాల్ విసురుతోంది. తృణమూల్ కోటను బద్ధలు కొట్టి ఎలాగైనా ఈ సారి పాగా వేయాలని కృతనిశ్చయంతో ఉంది భాజపా.
ఊపును కొనసాగించాలని..
2019 లోక్‌సభ ఎన్నికల్లో 42 స్థానాలకుగాను 18 సీట్లను కైవసం చేసుకున్న భాజపా అదే ఊపును శాసనసభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని భావిస్తోంది. ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు నడ్డా సహా ఆ పార్టీకి చెందిన అనేక మంది కీలక నేతలు తొలి విడత ప్రచారంలో పాల్గొన్నారు. అంఫన్ తుపాను సాయంలో అక్రమాలు, తృణమూల్ నేతల వసూళ్లు, భాజపా కార్యకర్తలపై దాడుల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఆ పార్టీపై విరుచుకుపడ్డారు. ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన వంటి కేంద్ర పథకాలు బంగాల్‌లో అమలు కాకపోవడం, ఆర్థిక వెనకబాటు, తొలి విడత పోలింగ్ జరిగే పలు నియోజకవర్గాల్లో మంచినీటి కొరత వంటి అంశాలను కూడా ప్రస్తావించారు.