బంగాల్ పంచాయతీ ఎన్నికల్లో 53 ఏళ్లుగా గెలుస్తున్న ఓ వ్యక్తి.. 88 ఏళ్ల వయసులోనూ మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. తననూ ఎవరూ ఓడించలేరని సవాల్ కూడా విసురుతున్నారు. వృద్ధాప్యంలోనూ నవ యువకుడిలా ప్రచారాన్ని హోరెత్తించారు. ప్రస్తుతం జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఆ వృద్ధుడికి తృణమూల్ కాంగ్రెస్ మరోసారి టికెట్ ఖరారు చేసింది. ఆయనే మెదినీపుర్ జిల్లా నందనపుర్-2 గ్రామ పంచాయతీకి చెందిన గోపాల్చంద్ర నంది.
గోపాల్చంద్ర నంది 1965లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పంచాయతీ ఎన్నికల్లో బరిలో దిగి గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పలుసార్లు విజయం సాధించారు. కొన్నాళ్ల క్రితం.. కాంగ్రెస్‌ను వీడి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ మారినా.. ఆయన విజయపరంపర ఆగలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్, వామపక్ష పార్టీలు అధికారంలో ఉన్న సమయంలోనూ ఆయన విజయఢంకా మోగించారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా విజయ పరంపర కొనసాగించారు. గోపాల్చంద్ర చివరగా.. పశ్చిమ మెదినీపుర్లోని దాస్‌పుర్-1 బ్లాక్‌లోని నందనపూర్-2 గ్రామ పంచాయతీ గోవిందనగర్ గ్రామం నుంచి గెలుపొందారు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా గోవిందనగర్ వెస్ట్ బూత్ నుంచి పోటీ చేస్తున్నారు.
1965 నుంచి 2018 వరకు.. దాదాపు 53 సంవత్సరాలు అప్రతిహతంగా విజయం సాధించిన గోపాల్ చంద్ర.. ఆ సమయంలో కొన్నిసార్లు గ్రామ పంచాయతీలో, కొన్నిసార్లు పంచాయతీ సమితి ఎన్నికలలో పోటీ చేశారు. కొన్నాళ్లు పంచాయతీ సర్పంచ్‌గా బాధ్యతలు కూడా నిర్వర్తించారు. 1965 నుంచి 1978 వరకు నందనపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఉన్నారు. వరుసగా 25 ఏళ్లు పంచాయతీ సభ్యుడిగా ఉన్నందుకు గుర్తింపుగా 2009లో కేంద్ర ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ కూడా పొందారు గోపాల్చంద్ర.