రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముపై బంగాల్ మంత్రి అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. తృణమూల్ మంత్రిపై భాజపా, కాంగ్రెస్ పార్టీలు తీవ్రస్థాయిలో మండి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. తమ కేబినెట్ మంత్రి చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. అలాగే, తమ పార్టీ తరఫున రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పారు. ఎవరిపైనా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తమ పార్టీ సంస్కృతి కాదన్న దీదీ.. సదరు నేతకు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపారు. రాష్ట్రపతి అంటే తమకెంతో గౌరవం ఉందని.. ఆమె ఓ స్వీట్ లేడీ అని దీదీ అన్నారు. అలాంటి వ్యక్తిపై కామెంట్లు చేసి మంత్రి తప్పు చేశారని.. ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తూ రాష్ట్రపతికి క్షమాపణలు చెబుతున్నట్టు వెల్లడించారు. మరోవైపు, రాష్ట్రపతి పట్ల మంత్రి అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ బెంగాల్ భాజపా ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేత సువేందు అధికారి సారథ్యంలో రాజ్‌భవన్ వరకు మార్చ్ నిర్వహించారు.
'రాష్ట్రపతి ఓ స్వీట్ లేడీ'.. బంగాల్ మంత్రి వ్యాఖ్యలకు దీదీ క్షమాపణ - రాష్ట్రపతి మమతా బెనర్జీ
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముపై మంత్రి అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యలకు బంగాల్ సీఎం మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు. రాష్ట్రపతి అంటే తమకెంతో గౌరవం ఉందని.. ఆమె ఓ స్వీట్ లేడీ అని దీదీ అన్నారు.
అసలేం జరిగిందంటే..
నందిగ్రామ్‌లో శుక్రవారం ఓ సమావేశం సందర్భంగా మంత్రి అఖిల్ మాట్లాడుతూ "నేను అందంగా లేనని వారు(భాజపా) అంటున్నారు, మేం ఎవరినీ వారి రూపం బట్టి అంచనా వేయం. రాష్ట్రపతి పదవిని గౌరవిస్తాం. కానీ మన రాష్ట్రపతి చూడటానికి ఎలా ఉంటారు?" అని వ్యాఖ్యానించారు. 17 సెకెన్ల పాటు ఉన్న వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. మంత్రికి ఉద్వాసన పలకాలని, మమతా బెనర్జీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని భాజపా డిమాండ్ చేసింది.
దీంతో మంత్రి స్పందిస్తూ.. "రాష్ట్రపతిని అవమానించాలని నా ఉద్దేశం కాదు. భాజపా నేతలు నాపై చేసిన మాటల దాడికి బదులిచ్చాను. రోజు నా రూపంపై వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రపతిని అగౌరవపరిచినట్లు ఎవరైనా భావిస్తే అది తప్పు. నాకు రాష్ట్రపతిపై అపారమైన గౌరవం ఉంది" అని ఓ వార్తా ఛానల్‌తో మాట్లాడుతూ అఖిల్ తెలిపారు. తర్వాత క్షమాపణ చెబుతూ ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. బెంగాల్ మంత్రి వ్యాఖ్యలపై ద్రౌపదీ ముర్ము సొంత రాష్ట్రమైన ఒడిశాలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. వివిధ ప్రాంతాల్లో అఖిల్ గిరికి వ్యతిరేకంగా ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.