West Bengal Minister Arrested :రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ బంగాల్ అటవీ శాఖ మంత్రి జ్యోతిప్రియో మల్లిక్‌ను అరెస్ట్ చేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులు ఓ ప్రకటన చేశారు. దాదాపు 20 గంటలపాటు ప్రశ్నించిన తర్వాత శుక్రవారం తెల్లవారుజామున అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మంత్రి జ్యోతిప్రియోను స్థానిక కోర్టులో హాజరుపరిచి కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.
తనకు వ్యతిరేకంగా జరిగిన భారీకుట్రలో తాను బాధితుడినంటూ అరెస్ట్ తర్వాత మంత్రి జ్యోతిప్రియ అన్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న జ్యోతిప్రియకు.. ప్రశ్నిస్తున్న సమయంలో ఏమైనా జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అంతకుముందు సీఎం మమతా బెనర్జీ హెచ్చరించారు.
'మా మంత్రులను టార్గెట్ చేస్తున్నారు'
'దుర్గాపూజ తర్వాత కేంద్రం మా మంత్రులను టార్గెట్ చేస్తోంది. నా ప్రశ్న ఒక్కటే.. ఎందుకు ఏ ఒక్క బీజేపీ నాయకుడి ఇంటిపై దాడులు నిర్వహించడం లేదు?' అని సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలను ప్రతిపక్ష నేత సువేంధు అధికారి ఖండించారు.
గురువారం మంత్రి జ్యోతిప్రియ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. మంత్రి మల్లిక్ వ్యక్తిగత సహాయకుడు అమిత్ డే నివాసం ఉండే నాగర్‌బజార్ ఫ్లాట్‌పై కూడా ఈడీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. అతడి కంపెనీల్లో రూ.50 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఈడీ వర్గాలు తెలిపాయి.
వ్యాపారవేత్తతో సంబంధాలు..
మరోవైపు ఈ కేసుతో సంబంధమున్న వ్యాపారవేత్త బాకీబుర్ రెహమాన్‌తో కూడా జ్యోతిప్రియో మల్లిక్‌కు ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. కాగా, గతవారం బాకీబుర్ రెహమాన్‌ను కైఖలిలోని అతడి ఫ్లాట్‌లో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా రెహమాన్‌కు రైస్‌మిల్లు వ్యాపారంతో పాటు పలు హోటళ్లు, రిసార్ట్‌లు, బార్‌లు కూడా ఉన్నాయని గుర్తించారు అధికారులు. అలాగే ఆయన గదిలో ప్రభుత్వ కార్యాలయాల స్టాంపులతో కూడిన 100కు పైగా పత్రాలు లభ్యమైనట్లు ED వర్గాలు తెలిపాయి.
Horoscope Today 27th October 2023 : ఈరోజు ఆ రాశివారి ఆరోగ్యం జాగ్రత్త.. ప్రమాదాలకు ఛాన్స్!
Minor Girl Carried Father On Rickshaw : వాహనంలో వెళ్లేందుకు డబ్బులు లేక.. 35కి.మీ రిక్షా తొక్కి తండ్రిని ఆస్పత్రిలో చేర్చిన బాలిక