రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మంత్రి అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యలు బంగాల్ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ఆయన కామెంట్స్ వైరల్‌గా మారడతో గిరి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. నందిగ్రామ్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో గిరి మాట్లాడుతూ. "నేను చూడడానికి బాగుండనని భాజపా వాళ్లు విమర్శిస్తుంటారు. రూపురేఖల్ని బట్టి ఓ వ్యక్తిని అంచనా వేయలేం కదా. మనమంతా రాష్ట్రపతిని ఎంతో గౌరవిస్తాం. మరి మన రాష్ట్రపతి చూడడానికి ఎలా ఉంటారు?" అని వ్యాఖ్యానించారు.
గంటల వ్యవధిలోనే ఆయన కామెంట్స్ వైరల్‌గా మారిపోయాయి. మంత్రి వ్యాఖ్యలను భాజపా తీవ్రంగా విమర్శించింది. మంత్రి గిరి మాటలను బట్టి తృణమూల్‌కు గిరిజనులంటే ఎంత గౌరముందో అర్థమవుతోందని ఆరోపించింది. తృణమూల్ గిరిజన వ్యతిరేకి అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొంది. తక్షణమే ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించి, ఆరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఈ అంశంపై జాతీయ మహిళా కమిషన్‌కు లేఖ రాసినట్లు భాజపా బంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ తెలిపారు. మరోవైపు మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భాజపా నిరసన ప్రదర్శనలు నిర్వహించింది.