ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఓ భర్త.. తన భార్య చేయి నరికేసిన సంఘటన ఇటీవల బంగాల్లో సంచలనంగా మారింది. కుడి చేయి లేదని నిరాశ చెందని రేణు ఖాతున్(23).. నర్సు ఉద్యోగం కోసం ఎడమ చేతితో రాయటం సాధన మొదలు పెట్టింది. తాజాగా ఆసుపత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆమెకు అనువైన ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే.. ఆమె వైద్య ఖర్చులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
"తూర్పు బుర్ద్వాన్ జిల్లాలోని కేతుగ్రామ్కు చెందిన బాధితురాలు రేణు ఖాతున్.. నర్సు ఉద్యోగానికి ఎంపికైంది. ఇప్పుడు ఆమె కుడి చేతిని కోల్పోయింది. ఆమెకు అనువైన ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పిస్తాం. రేణు ఖాతున్ చికిత్సను చీఫ్ సెక్రెటరీ హెచ్‌కే ద్వివేదీ పర్యవేక్షిస్తారు. బాధితురాలికి కృత్రిమ చేయి అందించేందుకు కృషి చేస్తాం. "
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి.
ఆసుపత్రికి వచ్చి తనను పరామర్శించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలిపారు రేణు. బిడ్డ కోసం ఒక తల్లిలా.. ఈరోజు తనకు మద్దతుగా నిలిచారని కొనియాడారు. తనను ఈ విధంగా మార్చిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరారు. రేణు ప్రస్తుతం దుర్గాపుర్ పారిశ్రామిక ప్రాంతంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం అందించే ఆరోగ్య కార్డు ఉన్నప్పటికీ వైద్యం కోసం ఆమె కుటుంబం రూ.57వేలు వెచ్చించాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి మమత.. వైద్య ఖర్చులు చెల్లించాలని చీఫ్ సెక్రెటరీకి సూచించారు.
అత్తవారింటి కుటుంబ సభ్యురాలిగా రేణు పేరు నమోదైందని, అందువల్ల ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె సోదరుడు రిపొన్ షేక్. మరోవైపు.. రేణు ఖాతున్ భర్త షరిఫుల్ షేక్‌తో పాటు ఈ సంఘటనకు సంబంధం ఉన్న అతని కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్డీపీఓ కౌశిక్ బసక్ తెలిపారు.
ఇదీ చూడండి:''కుడి చేయి నరికేస్తే ఏంటి? ఎడమ చేయి ఉందిగా!'.. ఆ నర్స్ తెగువకు సలాం'
భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని.. చేయి నరికేసిన భర్త