బంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వంపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రంలో సిండికేట్ రాజ్యం నడుస్తోందన్నారు. డబ్బులు ముట్టజెప్పకుండా ఏ పనీ జరగడం లేదని ఆరోపించారు. ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు బంగాల్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు మోదీ. రాష్ట్ర వారసత్వ సంస్కృతి, దిగ్గజాల పట్ల దీదీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హుగ్లీలో భాజపా నిర్వహించిన బహిరంగ సభలో దుయ్యబట్టారు.
" రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇల్లు అద్దెకు ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా తప్పనిసరిగా సిండికేట్ల అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి. వందేమాతర గేయం రాసిన బంకిం చంద్ర చటోపాధ్యాయ ఇంటిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని నా దృష్టికి వచ్చింది. భానిసత్వ సంకెళ్లు తెంచి స్వాతంత్ర్య పోరాటానికి కొత్త జీవం పోసిన ఆయన నివాసాన్ని పట్టించుకోకపోవడం బంగాల్ను అవమానించడమే. బంగాల్ ప్రజలు స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. వారు మార్పును కోరుకుంటున్నారు. మీరు ఆకాంక్షించే అభివృద్ధిని మేము సాధిస్తాం. కానీ ఎవ్వరినీ బుజ్జగించం. "
- ప్రధాని మోదీ.