Artificial Reproductive Organs Operation: బంగాల్లో ఉన్న డైమండ్ హార్బర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి విజయవంతమయ్యారు. బంగ్లాదేశ్‌కు చెందిన యువతికి కృత్రిమ పునరుత్పత్తి అవయవాలను.. శస్త్రచికిత్స ద్వారా వైద్యులు సృష్టించారు.
ఇదీ జరిగింది: బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యువతికి పుట్టుకతోనే పునరుత్పత్తి అవయవాలు లేవు. జన్యుపరమైన కారణాలతో మాత్రమే ఆ యువతి మహిళగా ఎదుగుతోంది. అయితే ఇటీవలే ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. వరుడి కుటుంబసభ్యులు శస్త్రచికిత్స చేయించుకోవడానికి అనుమతినిచ్చారు. ఏడాది క్రితం ఈ తరహా సర్జరీకి సంబంధించిన ఓ వీడియోను యూట్యూబ్‌లో యువతి కుటుంబ సభ్యులు చూశారు. ఆ వీడియో ఆధారంగా 15 రోజుల క్రితం డైమండ్ హార్బర్ ఆస్పత్రికి వచ్చింది యువతి. ఆమెను పరిశీలించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. మే15న శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఆ యువతి బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లింది. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని ఫోన్‌లో తెలిపింది ఆ యువతి. ఆసుపత్రి వైద్యులు, నర్సులు అందరికీ కృతజ్ఞతలు చెప్పింది. త్వరలోనే చెకప్‌కు రానున్నట్లు వెల్లడించింది.
"మా మెడికల్ కాలేజీలో గతంలోనూ ఇలాంటి సర్జరీలు జరిగాయి. ఈ సర్జరీలు చేసేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ వాటిన్నంటిని ఎదుర్కొని మేమంతా విజయవంతమయ్యాం" అని డాక్టర్ మానస్ సాహా తెలిపారు. "దేశంలో అత్యుత్తమ వైద్య కేంద్రాల్లో ఒకటిగా డైమండ్ హార్బర్ వైద్య కళాశాల నిలుస్తోంది. డాక్టర్లు, నర్సులతో పాటు అందరి సమష్టి కృషి వల్లే ఈ ఆపరేషన్‌లో విజయం సాధించాం" అని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఉత్పల్ ధామ్ అన్నారు.