మార్కెట్లో ఐఫోన్‌కు ఉండే క్రేజ్ మాములుగా ఉండదు. యాపిల్ ఫోన్‌ను కొనుక్కునేందుకు సొంత అవయవాలను సైతం అమ్ముకోవడం చూసే ఉంటాం. ఈ దంపతులు కూడా లేటెస్ట్ సిరీస్ స్మార్ట్ ఫోన్ కోసం ఏకంగా 8 నెలల కుమారుడిని అమ్మేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసేందుకు యాపిల్ ఫోన్‌ను కొనుక్కోవాలని అనుకున్నారు ఈ దంపతులు. ఈ షాకింగ్ ఘటన బంగాల్లోని ఉత్తర 24 పరగణాలు జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది
జిల్లాలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన జయదేవ్ ఘోష్, సతీ దంపతులకు 8 నెలల కింద ఓ బాలుడు జన్మించాడు. వీరిద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ ఉంటారు. అయితే, రీల్స్ బాగా చేసేందుకు ఐఫోన్ కొనాలని భావించారు దంపతులు. కానీ అందుకు సరిపడా డబ్బు లేకపోవడం వల్ల 8 నెలల శిశువును అమ్మేసేందుకుప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే జూన్ 22న ఖాఢ్దహా ప్రాంతానికి చెందిన ప్రియాంక అనే మహిళకు తమ బాబును అమ్మేసి.. యాపిల్ ఫోన్‌ను తెచ్చుకున్నారు.
మరోవైపు శిశువు కనిపించకుండా పోయి నాలుగు రోజులు అవుతున్నా.. పట్టించుకోకపోవడం వల్ల స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దంపతులను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి ఏడేళ్ల కూతురును అమ్మాలని అనుకోగా.. ఆ ప్లాన్ కుదరలేదని అందుకే చిన్నారిని విక్రయించామని జయదేవ్ చెప్పాడు. దీంతో శిశువు తల్లిదండ్రులతో పాటు కొన్నుకున్న మహిళపై కేసు నమోదు చేశారు పోలీసులు.
రెండు లక్షల కోసం చిన్నారి విక్రయం
ఉత్తర 24 పరగణాలు జిల్లాలోనే ఇదే తరహా ఘటన మరొకటి జరిగింది. రెండు లక్షల రూపాయలకు తన బిడ్డను వేరే వారికి విక్రయించింది ఓ తల్లి! అయితే, తాను బిడ్డను డబ్బులు ఇచ్చి తీసుకోలేదని శిశువును కొన్న మహిళ చెప్పుకొచ్చింది. స్థానికుల ఫిర్యాదు ఆధారంగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బిడ్డ తల్లిని, శిశువునుతీసుకున్న మహిళతో పాటు మధ్యవర్తిత్వం వహించిన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.