బంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందే తృణమూల్ కాంగ్రెస్ నాయకులను వేధించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుట్ర పన్నారని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఆయన సూచనల మేరకు ఎన్నికల కమిషన్ పనిచేస్తోందా అని అనుమానం వ్యక్తం చేశారు. బంగాల్లోని బాంకుడా జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మమత.. అమిత్ షాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
"నన్ను చంపడానికి భాజపా కుట్ర చేస్తోంది. నా సెక్యూరిటీ డైరెక్టర్ వివేక్ సహాయ్ను ఎన్నికల సంఘం తొలగించింది. ఎన్నికల సంఘాన్ని అమిత్ షా నడిపిస్తున్నారు. వారి పనుల్లోనూ మంత్రి జోక్యం తగదు. ఈ పరిస్థితి మారకపోతే ఎన్నికల సంఘం ముందు ధర్నాకు దిగుతాను. దేశాన్ని కేంద్ర హోం మంత్రి పాలిస్తున్నారా? ఎక్కడ ఎవరిని అరెస్టు చేయాలో, ఎవరిని కొట్టించాలో అమిత్ షా ఎలా నిర్ణయిస్తారు? ఏ కేసును ఎవరు దర్యాప్తు చేయాలో కూడా ఆయన కనుసన్నల్లోనే జరుగుతోంది. మాకు పారదర్శకంగా ఉండే ఎన్నికలు కావాలి."
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి