ఏడాది క్రితం తప్పిపోయిన ఓ బాలుడ్నిఫేస్బుక్ మెసెంజర్ సహాయంతో తల్లిదండ్రులు చెంతకు చేర్చారు కొందరు బెంగళూరు యువకులు. దీంతో తమ కన్నబిడ్డను ఏడాది తర్వాత చూసిన తల్లిదండ్రులు పిల్లాడిని హత్తుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఆ యువకులకు జీవితాంతం రుణపడి ఉంటామని కన్నీరు పెట్టుకున్నారు. ఈ సంఘటన బెంగళూరులో జరిగింది.
అసలేం జరిగిందంటే?..బంగాల్‌కు చెందిన సుహాస్ అనే బాలుడు.. ఏడాది క్రితం తన స్నేహితులతో దాగుడుమూతలు ఆడుకుంటూ రైలు ఎక్కాడు. ఆ తర్వాత రైలు కదలింది. ఏం చేయాలో తెలియని ఆ పిల్లవాడు ఆ రైలులోనే బెంగళూరు స్టేషన్‌కు చేరుకున్నాడు.
15 రోజుల క్రితం బెంగళూరులో ఉన్న ఓ బేకరీ ముందు ఆకలితో అలమటిస్తూ కూర్చున్నాడు. బాలుడ్ని బేకరీ యజమాని రాజన్న, నితిన్, శ్రీధర్ గమనించారు. వివరాలు ఆరా తీయగా పిల్లవాడు తనకేం గుర్తులేవని హిందీలో చెప్పాడు. అతడి అన్నయ్య పేరు మాత్రమే చెప్పాడు. వెంటనే ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా ఆ పేరును సెర్చ్ చేసి ఫొటోను చూపించారు. బాలుడు.. తన అన్నయ్యను గుర్తుపట్టాడు. వెంటనే ఆ యువకులు సుహాస్ సోదరుడ్ని సంప్రదించారు. వచ్చి తన తమ్ముడ్ని తీసుకెళ్లమని చెప్పారు.