బంగాల్లో భాజపా కార్యకర్త తల్లి మరణంపై తీవ్రస్థాయిలో రాజకీయ దుమారం రేగింది. అధికార టీఎంసీపై భాజపా తీవ్ర ఆరోపణలు చేయగా.. వాటిని సీఎం మమతా బెనర్జీ తిప్పికొట్టారు.
నిమ్తాలోని భాజపా కార్యకర్త గోపాల్ మజుమ్దార్ తల్లి శోభను గత నెలలో ఆసుపత్రిలో చేర్చారు. 85ఏళ్ల తన తల్లిపై ముగ్గురు టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని గోపాల్ పేర్కొన్నాడు. దాడి జరిగిన కొద్దిసేపటికి భాజపా నేత సువేందు అధికారి.. గోపాల్ నివాసానికి వెళ్లారు. శోభను ఆసుపత్రికి తరలించారు. కొద్ది రోజుల చికిత్స అనంతరం.. నాలుగు రోజుల క్రితం ఆమె ఇంటికి చేరారు. తాజాగా.. సోమవారం తెల్లవారుజామున ఆ వృద్ధురాలు ప్రాణాలు విడిచారు.
'మమతను వెంటాడుతుంది..'
గోపాల్ తల్లి మరణంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఆ తల్లి మరణం.. మమతను వెంటాడుతుందని మండిపడ్డారు.
"శోభాజీ మరణ వార్తను విని తీవ్ర వేదనకు గురయ్యాను. టీఎంసీ గూండాలు ఆమెను తీవ్రంగా కొట్టారు. ఆ నొప్పి, ఆమె కుటుంబసభ్యుల బాధ.. మమతను వెంటాడతాయి. బంగాల్లో అహింస కోసం భాజపా పోరాడుతుంది. బంగాల్ తల్లులు, సోదరీమణుల భద్రత కోసం భాజపా పోరాడుతుంది."