బంగాల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది భారతీయ జనతా పార్టీ. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. మమతను గద్దె దించి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కీలక 109 స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ట్రబుల్ షూటర్స్‌గా భావించే.. 22 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు, కేంద్ర మంత్రులను రంగంలోకి దించింది. ఆ నియోజకవర్గాల ఎన్నికల బాధ్యతలను వారికి అప్పగించింది పార్టీ అధినాయకత్వం.
ఈ నేతలు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో ఓటర్లను ఆకట్టుకునే ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అక్కడే ఉంటూ పార్టీ స్థానిక నాయకత్వానికి దిశా నిర్దేశం చేయనున్నారు.
ఎవరెవరికి.. ఏయే బాధ్యతలు?
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఉత్తర కోల్‌కతాలోని 9 నియోజక వర్గాల బాధ్యతలను అప్పిగించారు. ఖర్ధా, నార్త్ దమ్ దమ్, కామర్హటి, పానిహటి, బారానగర్, దమ్ దమ్, రాజర్ హట్ న్యూటౌన్, బిదానగర్, రాజర్హట్ గోపాల్ పుర్ నియోజకవర్గాల్లో ఎన్నికలను ఆయన పర్యవేక్షించనున్నారు.
హౌరా రూరల్‌లోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గ బాధ్యతలను కేంద్ర మాజీ మంత్రి రాధామోహన్ సింగ్‌కు అప్పగించారు. బారక్‌పుర్‌లో ఉంటూ.. భట్పరా, నయహటి, నోపారా, బారక్‌పుర్ ఎన్నికలను కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ పర్యవేక్షించనున్నారు.
బషీర్హట్లోని నాలుగు నియోజకవర్గాల ఎన్నికల బాధ్యతలను ఎస్సీ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ వినోద్ సోన్కర్ చూసుకోనున్నారు. బషీర్‌హట్, బరాసాట్ నియోజకవర్గాల్లో స్థానిక పార్టీ విభాగంతో కలిసి బిహార్ వైద్య ఆరోగ్య మంత్రి మంగళ్ పాండే పని చేయనున్నారు.