అధికార తృణమూల్ కాంగ్రెస్, భాజపా మధ్య నువ్వా-నేనా అనే విధంగా పోటీ నెలకొన్న బంగాల్లో శనివారం ఐదోదశ పోలింగ్ జరగనుంది. ఎన్నికలు జరగనున్న 45 స్థానాల్లో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కస్థానం కూడా గెలవని భాజపా 2019 పార్లమెంటు ఎన్నికల్లో తృణమూల్‌పై ఆధిక్యం చాటుకుంది. మళ్లీ అదేజోరు కొనసాగిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఉత్తర పరగణాలులో 16 స్థానాలు, తూర్పు వర్ధమాన్, నదియాలో 8, జాల్‌పాయ్‌గుడీలో ఏడు, డార్జీలింగ్‌లో ఐదు, కాలీంపాంగ్‌లో ఒక నియోజకవర్గానికి ఓటింగ్ జరగనుంది. వివిధపార్టీల తరఫున పోటీలో ఉన్న 342 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని కోటీ 13లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. 15వేల 789 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం ఆరున్నర వరకు ఓటింగ్ జరగనుంది.
మంత్రి బ్రత్యబసు, భాజపా నేత సామిక్ భట్టాచార్య, సిలిగుడి మేయర్, లెఫ్ట్ నేత అశోక్ భట్టాచార్య తదితరులు ఈ విడతలో పోటీ చేస్తున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఈ 45 నియోజకవర్గాల్లో టీఎంసీ కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యం సాధించింది. అదే 2016 శాసనసభ ఎన్నికల్లో టీఎంసీ 32 సీట్లు గెలుపొందగా కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి 10స్థానాలు కైవసం చేసుకుంది. భాజపా మాత్రం ఖాతా కూడా తెరవలేదు.
పటిష్ఠ బందోబస్తు..
ఐదో విడత పోలింగ్ కోసం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. కూచ్‌బిహార్ కాల్పుల ఘటన నేపథ్యంలో 48 గంటలకు బదులు 72 గంటల ముందుగానే ప్రచారాన్ని నిలిపి వేసింది. నాలుగో విడతలో రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఐదుగురు చనిపోవటంతో ఈసీ అప్రమత్తమైంది. పోలింగ్ జరిగే 45 నియోజకవర్గాల పరిధిలో రాష్ట్ర పోలీసులతోపాటు 853 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది.