బంగాల్ శాసనసభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు 79.08 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. నాలుగు జిల్లాల పరిధిలోని 43 నియోజకవర్గాల్లో 306 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు.
కరోనా నిబంధనల మధ్య సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్ జరగగా.. కొవిడ్ బాధితులకు చివరి గంటలో ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. హింసాత్మక ఘటనలు జరగకుండా చూసేందుకు 1071 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది ఈసీ.
పలు చోట్ల ఉద్రిక్తత
జగ్ద్దాల్ అసెంబ్లీ నియోజకవర్గంలో తమ పార్టీకి చెందిన ఏడుగురు పోలింగ్ ఏజెంట్లు కనబడకుండా పోయారని టీఎంసీ ఆరోపించింది. ఫోన్ ద్వారాను వారి ఆచూకీ లభించటం లేదని పేర్కొంది. జిల్లాలోని మేఘ్నా ప్రాంతంలో బాంబు దాడులు జరిగిన క్రమంలో వారు గల్లంతైనట్లు తెలిపింది.