పర్యావరణ పరిరక్షణ కోసం భారత్-స్వీడన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన 'లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్-లీడ్ఇట్'లో చేరాలన్న అమెరికా నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. అది ప్యారిస్ ఒప్పందం లక్ష్యాలను చేరుకునేందుకు సాయం చేస్తుందని వ్యాఖ్యానించింది.
అమెరికా ప్రకటనను స్వాగతిస్తూ భారత ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
" లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్, లీడ్ఇట్లో అమెరికా అధ్యక్షుడు చేరటాన్ని స్వాగతిస్తున్నాం. భారీ పరిశ్రమల్లో మార్పునకు భారత్-స్వీడన్ పర్యావరణ చర్యలు దారి తీస్తాయి. అది ప్యారిస్ ఒప్పందం లక్ష్యాలను చేరుకునేందుకు సాయం చేస్తుంది. పోటీతత్వాన్ని బలోపేతం చేయటం, స్థిరమైన ఉద్యోగాల సృష్టికి దోహదపడుతుంది. "
- పీఎంఓ, భారత్
వర్చువల్ భేటీలో ప్రకటన..
పర్యావరణ మార్పులపై అమెరికా ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్. వాతావరణ, ఇంధన లక్ష్యాలను చేరుకునేందుకు కొత్త భాగస్వామ్యంలో ప్రధాని మోదీతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అది ద్వైపాక్షిక సహకారంలో కీలకంగా మారుతుందని వ్యాఖ్యానించారు. 'బృందంలో చేరి ఆయా దేశాలకు భాగస్వామిగా ఉండాలనుకుంటున్నాం. స్వీడన్, భారత్తో పాటు లీడ్ఇట్తో చేతులు కలిపి పరిశ్రమల రంగం సహా కీలక రంగాల్లో కర్బణ ఉద్గారాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తాం.' అని పేర్కొన్నా బైడెన్.