బంగాల్ దంగల్ ముగిసింది. బంగాల్ ప్రజలు.. తమ తీర్పును అందించారు. మమతకు హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టారు. ముచ్చటగా మూడోసారి తృణమూల్ కాంగ్రెస్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎలాగైన బంగాల్ పీఠాన్ని చేజిక్కించుకోవాలన్న భాజపా ఎత్తుగడలు ఫలించలేదు. ఇక కింగ్ మేకర్‌గా అవతరిస్తామన్న కాంగ్రెస్- లెఫ్ట్ కూటమి కుదేలైంది.
ఎత్తుగడలను ఎదుర్కొని..
అఖండ విజయం తర్వాత దేశ రాజకీయాల్లోనే భాజపాకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం మమతకు ఏర్పడింది. ఎన్నికల ప్రచార సమయంలో మతపరమైన భావోద్వేగ ప్రసంగాలతో ఓట్లను చీల్చాలని భాజపా వేసిన ఎత్తుగడలు.. చివరకు ఆ పార్టీనే కోలుకోలేని దెబ్బతీశాయని ఎన్నికల ఫలితాలను చూస్తే స్పష్టమవుతోంది. మాల్దా, ముర్షిదాబాద్ నియోజకవర్గాలతోపాటు దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు, హౌడౌ జిల్లాల్లోని మైనారిటీ ఓటర్లు తృణమూల్ కాంగ్రెస్ వైపే మొగ్గుచూపారు.
ఇదీ చదవండి :'నందిగ్రామ్ గురించి చింతించొద్దు.. తీర్పు ఏదైనా ఓకే'
ప్రయత్నాలు విఫలం
కమలదళం.. బంగాల్ పీఠాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని శాయశక్తులా పోరాడింది. ప్రధాని మోదీ, అమిత్ షాలు వరుస ర్యాలీలు, ప్రచార సభలతో ఓటర్లలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. వీరితో పాటు కైలాశ్ విజయవర్గీయ, బీఎల్ సంతోష్, అరవింద్ మీనన్, యోగి ఆదిత్యానాథ్ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు వరుస ర్యాలీలు నిర్వహించారు. ఎలాగైనా బంగాల్లో పాగా వేయాలన్న ఉద్దేశంతో.. బంగాల్‌కు కావాల్సింది 'అత్త' కాదని సరికొత్త నినాదానికి తెర తీసింది భాజపా. అయితే, బంగాల్‌ను దక్కించుకునేందుకు కమల దళం చేసిన ప్రయత్నాలు మమతా బెనర్జీకే ఇంకాస్త అనుకూలంగా మారాయని ఫలితాలు చూస్తే అర్థమవుతుంది.
ఇదీ చదవండి :'కూటమి' బేజారు- కామ్రేడ్లకు ఇక కష్టమే!
కుదేలైన కూటమి
కాంగ్రెస్ కంచుకోటగా భావించే మాల్దా, ముర్షిదాబాద్ లోనూ మమతకే పట్టం కట్టారు ఓటర్లు. ఇక బంగాల్లో మూడో ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్- లెఫ్ట్ పార్టీల కూటమి.. తమ ఉనికిని కాపాడుకోలేని పరిస్థితిలోకి వెళ్లాయి. కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లు సైతం తృణమూల్ కాంగ్రస్కే దక్కాయి. వామపక్ష కూటమి మరోసారి తన అస్థిత్వాన్ని కోల్పోయింది.
ఇదీ చదవండి :పోరాటాలే మమత విజయానికి బాటలు