తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (ఫిబ్రవరి 20 - ఫిబ్రవరి 26) - వార ఫలాలు

Weekly Horoscope: ఈ వారం (ఫిబ్రవరి 20 - ఫిబ్రవరి 26) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

By

Published : Feb 20, 2022, 4:35 AM IST

Weekly Horoscope:ఈ వారం (ఫిబ్రవరి 20 - ఫిబ్రవరి 26) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

మేషం:

కాలం సహకరిస్తోంది. ధైర్యంగా పనులు పూర్తిచేయండి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారరీత్యా మిశ్రమఫలం. వారం మధ్యలో ఆనందించే అంశముంది. అపోహలు తొలగుతాయి. కొన్ని సమస్యలకు సమాధానం దొరుకుతుంది. ఆవేశపరిచే వారున్నారు. శాంతంగా మాట్లాడాలి. విష్ణుసహస్ర నామం చదివితే మంచిది.

వృషభం:

అధికారబలం పెరుగుతుంది. ఉద్యోగంలో గుర్తింపూ ఆర్థికంగా వెసులుబాటూ ఉంటాయి. వ్యాపారబలం మిశ్రమం. పట్టుదలతో ముందుకు సాగండి. కొందరివల్ల మేలు జరుగుతుంది. స్వయంకృషితోనే అభివృద్ధి సాధ్యం. కాలం కొంత వ్యతిరేకంగా ఉన్నందువల్ల సంయమనం పాటించండి. ఇష్టదైవాన్ని ప్రార్థించండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది.

మిథునం:

ఈ వారం శుభప్రదంగా మొదలవుతుంది. ఆలోచనల్లో స్పష్టత అవసరం. గందరగోళ స్థితికి దూరంగా ఉండాలి. ఎదుగుదలకు అవసరమైన పనులు మొదలుపెట్టాలి. వ్యాపార నష్టం రాకుండా చూడాలి. పట్టువిడుపులు మేలు. మొహమాటం వల్ల ఆర్థిక నష్టం జరగవచ్చు. ఇంట్లోవారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. ఇష్టదైవ స్మరణతో శాంతి లభిస్తుంది.

కర్కాటకం:

మనోబలం అవసరం. ఉద్యోగపరంగా ఒడుదొడుకులుంటాయి. సమయస్ఫూర్తితో సమస్యలు తొలగుతాయి. అధికార లాభం సూచితం. భారీ లక్ష్యాలతో ముందడుగు వేయాలి. వ్యాపారంలో సమస్య రాకుండా జాగ్రత్తపడాలి. ఆర్థిక నష్టం సూచితం. సమష్టి నిర్ణయాలతో మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. నచ్చిన దైవాన్ని దర్శించండి, శుభం జరుగుతుంది.

సింహం:

ఉత్తమకాలం నడుస్తోంది. అన్నివిధాలా మేలు చేకూరుతుంది. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. పెద్దల ఆశీర్వచనం ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం మీదే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇంట్లోవారిని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ఏది ప్రారంభించినా కలిసి వస్తుంది. ప్రేమానురాగాలు లభిస్తాయి. వ్యాపారం శుభప్రదం. లక్ష్మీధ్యానం మంచిది.

కన్య:

ఆత్మవిశ్వాసంతో పని ప్రారంభించండి. విజయం లభిస్తుంది. ఉద్యోగపరంగా పదవీ యోగం సూచితం. తోటివారి ప్రశంసలు లభిస్తాయి. మీ శ్రమ ఫలిస్తుంది. ఆశయం నెరవేరుతుంది. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకునే కాలమిది. వ్యాపారంలో జాగ్రత్త. ఆంజనేయస్వామిని స్మరించండి, మనశ్శాంతి లభిస్తుంది.

తుల:

అదృష్టఫలాలు అందుతాయి. అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం లభిస్తుంది. దగ్గరివారి వలన కలిసి వస్తుంది. వ్యాపారం చాలా బాగుంటుంది. ధనలాభం పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. జీవితంలో పైకి వచ్చే అంశాలు చాలా ఉన్నాయి. ఒక క్రమ పద్ధతిలో ముందుకు సాగండి. దుర్గాదేవిని స్మరిస్తే మంచిది.

వృశ్చికం:

కార్యసిద్ధి ఉంటుంది. అదృష్టయోగాన్ని అందుకుంటారు. ఆత్మస్థైర్యం తగ్గకుండా పట్టువిడుపులతో పనులను పూర్తి చేయండి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో మంచి ఫలితాలున్నాయి. వ్యాపారరీత్యా మిశ్రమ ఫలితం గోచరిస్తోంది. వివాదాల జోలికి పోవద్దు. వారాంతంలో విజయం లభిస్తుంది. సూర్య నమస్కారంతో మానసిక శక్తి పెరుగుతుంది.

ధనుస్సు:

సర్వోత్తమ కాలం. ఏ పనిచేసినా విజయం వరిస్తుంది. మంచి పనులతో బంగారు భవిష్యత్తును సొంతం చేసుకోండి. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. సందేహించకుండా లక్ష్యాన్ని సాధించండి. మిత్రుల ద్వారా లాభపడతారు. పలు మార్గాల్లో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగరీత్యా స్థిరత్వం వస్తుంది. వ్యాపారం బాగుంటుంది. ఇష్టదైవ స్మరణ మంచిది.

మకరం:

ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండండి. ఇబ్బందులు కనపడుతున్నాయి. ఆలోచనల్లో గందరగోళస్థితి లేకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో ఓర్పు అవసరం. తెలియని వ్యక్తులతో చనువుగా సంభాషించవద్దు. అపార్థాలకు అవకాశముంది. కాలం సహకరించడం లేదు. మిత్రుల సలహా తీసుకోండి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మేలు.

కుంభం:

అదృష్టయోగం ఉంది. ఆర్థికంగా లాభముంటుంది. ఉద్యోగరీత్యా శ్రమ పెరుగుతుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ లక్ష్యాన్ని సాధించాలి. చంచలత్వంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ధర్మమార్గంలో ముందుకు సాగాలి. కుటుంబపరంగా అభివృద్ధి ఉంటుంది. స్వయంగా చేసే పనుల్లో త్వరగా పురోగతి ఉంటుంది. సూర్య నమస్కారం శుభప్రదం.

మీనం:

మంచి జీవితం లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. కాలం సహకరిస్తోంది. ఉద్యోగ, వ్యాపారాల్లో బాగుంటుంది. నిండు మనసుతో చేసే పని అద్భుతమైన విజయాన్నిస్తుంది. సమయస్ఫూర్తితో లాభపడతారు. ఎదురుచూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. సంకల్పం బలంగా ఉంటే ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఇష్టదైవాన్ని స్మరిస్తే మేలు జరుగుతుంది.

ABOUT THE AUTHOR

...view details