కన్నకూతురికి తన చేతులమీదుగా పెళ్లి చేయాలని ఆమె ఎన్నో కలల కనింది. కుమార్తెకు సరిజోడైన వరుడిని కూడా వెతికింది. ఇంకొక్క రోజులో నిశ్చితార్థం జరగనున్న తరుణంలో తీవ్ర అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరింది. చావు బతుకుల మధ్య ఉన్న తన చివరి కోరిక కుమార్తె పెళ్లి చేయడమే. ఇదే విషయాన్ని తన బంధువులకు చెప్పింది. వెంటనే వారంతా ఆమె కళ్ల ముందే కుమార్తె పెళ్లి జరిపించారు. కాసేపటికే ఆమె మరణించింది. బిహార్లోని గయ ఆస్పత్రిలో ఈ సంఘటన జరిగింది.
తల్లి చివరి కోరిక.. ICUలోనే పెళ్లి చేసుకున్న కూతురు.. జరిగిన రెండు గంటలకే.. - marriage in hospital icu
చావు బతుకుల మధ్య ఉన్న తన కన్నతల్లి చివరి కోరిక నెరవేర్చేందుకు ఓ కుమార్తె.. ఆస్పత్రి ఐసీయూలోనే పెళ్లి చేసుకుంది. కానీ వివాహం జరిగిన రెండు గంటలకే ఆమె తల్లి చనిపోయింది. దీంతో కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. బిహార్లోని గయలో జరిగిందీ సంఘటన.
అసలేం జరిగిందంటే?
జిల్లాలోని గురారు బ్లాక్.. బాలి గ్రామానికి చెందిన లాలన్ కుమార్ భార్య పూనమ్ వర్మ.. మగద్ బోధనాసుపత్రిలో ఏఎన్ఎమ్గా పనిచేసేది. చాలా కాలంగా ఆమె గుండెజబ్బుతో బాధపడుతోంది. అయితే ఆదివారం ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఆమెను గయలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించగా.. వైద్యులు ఏ క్షణమైనా చనిపోవచ్చని చెప్పేశారు.
ఆ సమయంలో పూనమ్ వర్మ.. కుమార్తె చాందిని పెళ్లి తన చేతుల మీదుగానే చేయాలని ఉందని కుటుంబసభ్యులకు తెలిపింది. కన్నకూతురి పెళ్లి చూసి చనిపోవాలనుకుంటున్నానని చెప్పింది. వాస్తవానికి.. చాందిని నిశ్చితార్థం డిసెంబరు 26న జరగాల్సి ఉంది. కానీ పూనమ్ చివర కోరిక నెరవేర్చేందుకు ఆదివారం ఆస్పత్రి ఐసీయూలోనే పెళ్లి చేశారు. వివాహం జరిగిన రెండు గంటలకే పూనమ్ చనిపోయింది. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.