సాధారణంగా వివాహాలు పెళ్లి మండపాలు, రిజిస్ట్రార్ ఆఫీస్‌లోనో జరుగుతాయి. డెస్టినేషన్ మ్యారేజెస్ గురించీ విన్నాం. సముద్ర గర్భంలో పెళ్లి చేసుకోవడాన్నీ చూశాం. కానీ ఓ జంట మాత్రం.. మద్యం షాపు ముందు పెళ్లి చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వివాహానికి ఓ ఎంపీ పురోహితుడిగా మారటం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
కేరళలో ఇతర కార్యకలాపాలపై ఆంక్షలు విధించి మద్యం దుకాణాలు మాత్రం పూర్తిస్థాయిలో అనుమతించడంపై ఆల్ కేరళ కేటరర్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన చేపట్టారు. నిరసనల్లో భాగంగా కోజికోడ్‌లోని సరోవరమ్ లిక్కర్ షాపు ముందు వివాహం నిర్వహించారు. కోజికోడ్ ఎంపీ ఎంకే రాఘవన్ పురోహితుడిగా మారి ఈ వివాహం జరిపించడం విశేషం.
నో పర్మిషన్..
మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం.. కేటరింగ్ సేవలకు మాత్రం పర్మిషన్ ఇవ్వటం లేదని కేటరర్స్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కేటరింగ్ రంగంపై అనేక మంది ఆధారపడుతున్నారని.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్ల అనేక మంది జీవనోపాధి దెబ్బతింటోందన్నారు.