Heavy Rains Over Next 2 Days In Telangana : వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో ఆవర్తన ప్రభావంతో.. ఇదే ప్రాంతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజులపాటు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది.
ఈ అల్పపీడనం సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ.. ఎత్తుకు వెళ్లేకొలది నైరుతి దిశ వైపుగా వంపు తిరిగిందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొమురం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
హైదరాబాద్‌లో భారీ వర్షాలు : నైరుతి రుతుపవనాల రాక.. అల్ప పీడన ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లోని కూకట్పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, ప్రగతి నగర్, మూసాపేట్, బాచుపల్లి, కేపీహెచ్‌బీ కాలనీల్లో వర్షం పడింది. అలాగే కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, కొంపల్లి, సురారం, షాపూర్ నగర్, చింతల్, జగద్గిరిగుట్ట, మల్కాజ్గిరి ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. వర్షాలు పడడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వర్షపు నీరు రోడ్లపై భారీగా నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.