తెలంగాణ

telangana

ETV Bharat / bharat

500 ఏళ్ల నాటి రాయితో వర్షాల అంచనా... ఎండల తీవ్రతనూ ముందే పసిగడుతుందట! - పానీపట్ దర్గా రాయి

వర్షాలు ఎప్పుడు పడతాయనే విషయం తెలుసుకోవాలంటే వాతావరణ శాఖ అప్​డేట్లను చూస్తుంటాం. కానీ హరియాణా పానీపత్​లోని దర్గాలో మాత్రం ఓ రాయిని చూస్తున్నారు అక్కడివారు. వాతావరణం ఎలా ఉంటుందనే విషయాన్ని ఆ రాయి చెబుతుందని అంటున్నారు. మరి ఆ రాయి విశేషాలేంటో తెలుసుకుందామా?

weather-prediction-by-stone
weather-prediction-by-stone

By

Published : Jun 12, 2023, 11:18 AM IST

సమాచార సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు వచ్చిన ప్రస్తుత ఆధునిక యుగంలో వాతావరణం గురించి తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. వర్షాలు ఎప్పుడు పడతాయి? ఎప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి? వడగాలుల ప్రభావం.. చలి తీవ్రత వంటి వివరాలన్నీ ముందుగానే పసిగట్టే సాంకేతికత ప్రస్తుతం అందుబాటులో ఉంది. భారత వాతావరణ శాఖ ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్​డేట్లు ఇస్తూ ఉంటుంది. కానీ, 500 ఏళ్ల క్రితమే ప్రజలు వాతావరణాన్ని అంచనా వేసేవారని తెలుసా? క్యాలెండర్​ను చూసి కాలాల్లో మార్పులు చెప్పినట్లే.. ఓ వినూత్న సాధానాన్ని ఉపయోగించి వర్షాలు, వడగాలులు, శీతలగాలుల గురించి తెలుసుకునేవారని ఎప్పుడైనా విన్నారా? దీని గురించి తెలియాలంటే హరియాణాలోని పానీపత్​కు వెళ్లాల్సిందే.

పానీపత్​లోని బూ అలీ కలందర్ షా దర్గాలో ఓ రాయిని చూసి వాతావరణాన్ని అంచనా వేస్తున్నారు. 500 ఏళ్ల నాటి ఈ రాయి.. వాతావరణ పరిస్థితులను బట్టి మారిపోతుందని చెబుతున్నారు. వర్షాలు ఎప్పుడు పడతాయి? ఎంత మేర పడతాయి? అనే విషయాలు ఈ రాయితో తెలుస్తాయని అంటున్నారు. ఉష్ణోగ్రతలు ఎప్పుడు పెరుగుతాయి? ఎండల తీవ్రత ఏ మేర ఉంటుందనే వివరాలూ తెలుసుకోవచ్చని చెబుతున్నారు. శీతాకాలంలోనూ ఈ రాయితో ఉష్ణోగ్రతలు అంచనా వేయవచ్చని స్పష్టం చేస్తున్నారు.

వాతావరణాన్ని అంచనా వేసే రాయి

వర్షాలైతే అలా.. ఎండలైతే ఇలా..
వర్షాలు పడే పరిస్థితి ఉంటే రాయి తడిగా మారుతుందని దర్గాలో ఉండే ఖాదీం మహమ్మద్ రిహాన్ చెబుతున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే.. రాయి నుంచి ధారగా నీరు వస్తుందని చెప్తున్నారు. ఎండలు అధికంగా ఉండే సమయంలో ఈ రాయి పొడిగా మారిపోతుందని, ఉష్ణోగ్రతలు మరింత ముదిరే ఛాన్స్ ఉంటే రాయి వేడిగా తయారవుతుందని అంటున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోయే ముందు ఈ రాయిలో కూడా మార్పులు వస్తాయని చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గే ముందు ఈ రాయి చల్లగా మారిపోతుందని అంటున్నారు.

దర్గాలో ఉన్న రాయి

ఎన్ని పరిశోధనలు చేసినా...
'మౌసమ్' రాయిగా పిలుస్తున్న దీన్ని అప్పట్లో ఓ నవాబ్.. దర్గాలో ఏర్పాటు చేయించారని సమాచారం. దర్గాలో ఇలాంటి అరుదైన రాళ్లు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటినీ దర్గా నిర్మాణ సమయంలోనే గోడలకు అమర్చినట్లు తెలుస్తోంది. అయితే, అందులో ఒకటి మాత్రం వాతావరణాన్ని అంచనా వేసేందుకు ఉపయోగపడుతోందని ఖాదీం చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఈ దర్గా.. వాతావరణాన్ని అంచనా వేయడంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలిపారు. వాతావరణంలో మార్పు రాకముందే.. ఈ రాయిలో ఎందుకు మార్పులు వస్తున్నాయో తెలుసుకునేందుకు అనేక పరిశోధనలు జరిగాయని తెలిపారు. ఈ రాయి ఎలా పనిచేస్తుందనే విషయంపై ఎవరూ సరైన వివరణ ఇవ్వలేకపోయారని అన్నారు.

బూఅలీ షా కలందర్ దర్గాలో రాయి

తన తండ్రి మహమ్మద్ సూఫీ దర్గా సంరక్షకుడిగా పనిచేసేవాడని, ఈ రాయిని చూసి ఆయన వాతావరణాన్ని అంచనా వేసేవాడని రిహాన్ తెలిపారు. మరికొందరు జ్ఞానులకు కూడా ఈ రాయిని చూసి వాతావరణాన్ని అంచనా వేయడం తెలుసని పేర్కొన్నారు. విదేశాల నుంచి కూడా వచ్చి రాయిని పరిశీలించారని చెప్పారు. 'రెండు నెలల క్రితం నా తండ్రి మరణించాడు. ప్రస్తుతం ఈ రాయిని చూసి వాతావరణం చెప్పేవారు ఎవరూ దర్గాలో లేరు' అని రిహాన్ వివరించారు.

ఈ రాయి ఎక్కడి నుంచి వచ్చిందనే దానికి పెద్ద చరిత్రే ఉంది. 500 ఏళ్ల క్రితం కైరానాలో.. నవాబ్ ముకర్రమ్ అలీ అనే గొప్ప వైద్యుడు ఉండేవాడు. ఆయనే బూఅలీ షా దర్గాలో ఈ రాయిని ఏర్పాటు చేయించాడు. ముస్లిం పురాణాల్లో ఉండే 'జిన్' (అల్లాదీన్) కుమార్తెకు ముకర్రమ్ అలీ వైద్యం చేశాడు. ముకర్రమ్ సేవలకు ముగ్ధుడైన జిన్.. వాతావరణాన్ని అంచనా వేసే రాయితో పాటు పలు ప్రత్యేక రాళ్లను ఆయనకు బహూకరిస్తాడు. ఇస్లాం పండితుడైన బూఅలీ షా కలందర్​ను అనుసరించే ముకర్రమ్ అలీ.. ఆయన పేరుతో దర్గా నిర్మాణం చేపట్టి దానిలోనే ఈ రాళ్లను అమర్చేలా ఆదేశాలు ఇచ్చాడు. ముకర్రమ్ అలీ మరణం అనంతరం ఇదే దర్గాలో ఆయన్ను పూడ్చిపెట్టారు.

బూఅలీ షా కలందర్ దర్గా

ABOUT THE AUTHOR

...view details