Akhilesh yadav Interview: ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్. సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఇంటిదారి చూపిస్తామని అంటున్నారు. పెద్ద పార్టీలతో గతంలో పొత్తులు కలిసిరాలేదని, అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో కులగణన నిర్వహిస్తామని 'ఈనాడు'ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే?
ఈ దఫా అసెంబ్లీ ఎన్నికలను ‘80% వర్సెస్ 20%’గా సీఎం యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించారు. హిందువులు, ముస్లింల మధ్య పోటీగా చిత్రీకరించేందుకే అలా వ్యాఖ్యానించినట్లు విశ్లేషణలున్నాయి. దీనిపై మీ అభిప్రాయమేంటి?
అఖిలేశ్: సమాజంలోని అన్ని వర్గాలను మా పార్టీ సమానంగా ఆదరిస్తుంది. భాజపా వైఖరి అందుకు పూర్తి భిన్నం. ఓబీసీలు, దళితులు, మైనారిటీలపై ఆ పార్టీ వివక్ష చూపుతుంటుంది. ఈ ఎన్నికలను ‘80% వర్సెస్ 20%’గా అభివర్ణించడం ద్వారా.. భాజపాకు రాష్ట్రంలో కేవలం 20% సీట్లే రాబోతున్నాయని, 80% స్థానాలను ఎస్పీ గెల్చుకుంటుందని యోగి అంగీకరించినట్లయింది.
యోగి కేబినెట్‌లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల నుంచి పలువురు మంత్రులున్నారు. గత ఏడాది జులైలో కేంద్ర మంత్రివర్గంలోకి యూపీ నుంచి ఏడుగురు నేతలను తీసుకోగా.. వారిలో ఆరుగురు ఈబీసీ, దళిత సామాజికవర్గాలకు చెందినవారే. అలాంటప్పుడు కమలదళం వివక్ష చూపుతోందని ఎలా అంటారు?
వారు పేరుకు మాత్రమే వెనుకబడిన తరగతుల నేతలు. వారు నిజంగా ఆ సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లయితే.. కులగణన చేపట్టాలని ప్రభుత్వాన్ని ఎందుకు ఒప్పించడం లేదు? వాస్తవమేంటంటే.. భాజపాలో ఏ సామాజికవర్గానికీ విలువ లేదు.
కులగణన కోసం వినిపిస్తున్న డిమాండ్‌పై మీ స్పందన?
మేం అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లో కులగణన నిర్వహిస్తాం. ఓబీసీ కులాలవారు తమ సామాజికవర్గ జనాభా ప్రాతిపదికన సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందేందుకు అది దోహదపడుతుంది. దళితులు, మైనారిటీలకూ అది ప్రయోజనకరమే.
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ జట్టు కట్టాయి. ఇప్పుడెందుకు కలిసి పోటీ చేయట్లేదు?
మళ్లీ కలిసి బరిలో దిగాలనే మా పార్టీ భావించింది. కానీ- రాజకీయపరమైన కొన్ని కారణాల వల్ల బీఎస్పీ అధినాయకురాలు మాయావతి అందుకు అంగీకరించలేదు.
పశ్చిమ యూపీలో 40 చోట్ల బీఎస్పీ ముస్లిం అభ్యర్థులను పోటీకి దించింది. ఆ వర్గం ఓట్లను చీల్చేందుకే అలా చేశారని భావిస్తున్నారా?
భాజపా, బీఎస్పీ పరస్పర అవగాహన ప్రకారం ముందుకు సాగుతున్నాయన్నది బహిరంగ రహస్యం! పంచాయతీ ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులను ఓడించేందుకు ఆ రెండు పార్టీలు ఇలాంటి కుట్రను అమలు చేశాయి. ఇప్పుడూ అదే బాటలో నడుస్తున్నాయి. అయితే ప్రజలు తెలివైనవాళ్లు. బీఎస్పీ ఎజెండా ఏంటో వారికి బాగా తెలుసు.
ఎన్నికలు పూర్తయ్యాక మిత్రపక్షాలను మార్చే అలవాటు ఆర్‌ఎల్‌డీకి ఉంది. ఫలితాల తర్వాత ఆ పార్టీ మీతో కలిసి ఉంటుందని నమ్మకముందా?
భాజపాతో పొత్తు పెట్టుకోవాలని ఆర్‌ఎల్‌డీ అధినేత జయంత్ చౌధరీని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగంగా ఆహ్వానించారు. అయినా జయంత్ అందుకు అంగీకరించలేదు. ఆయన మాతోనే ఉంటారని విశ్వాసముంది.
వివాదాస్పద సాగుచట్టాలను కేంద్రం రద్దు చేసినా.. ప్రచారంలో మీరెందుకు ఆ చట్టాల గురించి పదేపదే మాట్లాడుతున్నారు?