కొవిడ్ నిరోధానికి ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను, 2021 జనవరి నుంచి ప్రతినెలా 10 కోట్ల డోసుల చొప్పున ఉత్పత్తి చేయాలని పుణెకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) నిర్ణయించింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ మూడోదశ క్లినికల్ పరీక్షలు దేశీయంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను 5 కోట్ల డోసుల మేర ఉత్పత్తి చేసిన సంస్థ, అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ అనుమతి కోరిన సంగతి విదితమే. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు మరింత సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐఐను డ్రగ్ కంట్రోలర్ అడిగినట్లు తెలిసింది. 23,000 మందిపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించగా, సగటున 70 శాతానికి పైగా సామర్థ్యాన్ని చూపిందని ఆస్ట్రాజెనెకా వెల్లడించిన సంగతి విదితమే. భవిష్యత్తులో ప్రబలే వ్యాధులను దృష్టిలో ఉంచుకుని, 2022 కల్లా తమ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుత 150 కోట్ల డోసుల నుంచి 250 కోట్ల డోసులకు పెంచుకుంటామని ఎస్‌ఐఐ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) ఆదార్ పూనావాలా చెప్పారు. తాము అనేక రకాల వ్యాక్సిన్లు తయారు చేయడాన్ని ఆయన గుర్తు చేశారు. తాము తయారు చేస్తున్న కొవిషీల్డ్‌ను తొలుత భారత్‌లోనే పంపిణీ చేస్తామని తెలిపారు. తదుపరి ఆఫ్రికా సహా ఇతర వర్థమాన దేశాలకు సరఫరా చేస్తామని వివరించారు. .
క్లినికల్ పరీక్షల్లో ఆస్ట్రాజెనెకా, ఆర్‌డీఐఎఫ్ భాగస్వామ్యం
కొవిడ్ నిరోధానికి తాము అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌లో ఒక కాంపొనెంట్‌ను, తమ క్లినికల్ పరీక్షల్లో ప్రయోగించడానికి ఆస్ట్రాజెనెకా అంగీకరించిందని రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) శుక్రవారం ప్రకటించింది. ఆర్‌డీఐఎఫ్, గమాలెయా సంస్థలు నవంబరు 23న ప్రతిపాదించిన మేర 2 హ్యూమన్ అడెనోవైరస్ వెక్టార్స్‌లో ఒక కాంపొనెంట్‌ను క్లినికల్ పరీక్షల్లో ఆస్ట్రాజెనెకా వినియోగించనుంది. ఈ నెలాఖరు కల్లా స్పుత్నిక్ వి హ్యూమన్ అడెనోవైరల్ వెక్టార్ టైప్ ఏడీ 26తో కలిసి ఆస్ట్రాజెనెకా తాము అభివృద్ధి చేసిన ఏజడ్‌డీ 1222ను క్లినికల్ పరీక్షల్లో వాడనుంది. ఈ రెండింటి కలయికతో మరింత మెరుగైన వ్యాక్సిన్ అభివృద్ధి చేయొచ్చా అనిశాస్త్రవేత్తలు పరిశోధన చేయనున్నారు.
వర్థమాన దేశాలకు కొవిడ్ వ్యాక్సిన్