నూతన పార్లమెంట్ భవనం- సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు అనుమతివ్వడాన్నికేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ స్వాగతించారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
మెజారిటీ తీర్పు..
దిల్లీ ప్రపంచ స్థాయి రాజధానిగా అవతరించబోతోందని.. 2022లో జరిగే 75వ స్వాతంత్ర్య వేడుకల సమయానికి నూతన పార్లమెంటు భవనం అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై గౌరవ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. పర్యావరణానికి హాని చేయకుండా.. ఉన్నత ప్రమాణాలతో నిర్మాణాన్ని చేపట్టడం పట్ల మా ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది.
-హర్దీప్ సింగ్ పురీ
పది అంతస్తుల్లో ప్రధాని భవనం..
నూతన పార్లమెంటు భవనంలో ప్రధాని నివాసాన్ని పది అంతస్తుల్లో.. గరిష్ఠంగా 12 మీటర్ల ఎత్తుతో నిర్మించనున్నారు. కేంద్ర ప్రజా పనుల విభాగం ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని రూ.11,794కోట్ల నుంచి.. రూ.13,450కోట్లకు సవరించింది.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టు డిజైన్, స్థలం కేటాయింపు, పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ అంశంలో కేంద్రం వాదనలతో ఏకీభవించిన జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని.. త్రిసభ్య ధర్మాసనం 2-1 తేడాతో తీర్పు వెలువరించింది. ఈ ప్రాజెక్టుకు కావలసిన అనుమతులన్నీ ఉన్నాయని.. ఈ స్థలాన్ని సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణానికి ఉపయోగించుకోవచ్చని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌కు సుప్రీంకోర్టు అనుమతి