తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jan 14, 2024, 5:59 PM IST

ETV Bharat / bharat

'మీ బాధను అర్థం చేసుకున్నా- మణిపుర్​లో​ శాంతి నెలకొల్పుతా'- మోదీ, బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్

Bharat Jodo Nyay Yatra Rahul Gandhi Speech : హింసకు గురైన మణిపుర్​లో శాంతి నెలకొల్పుతానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాగ్దానం చేశారు. ఈ రాష్ట్రం భారత్‌లో అంతర్భాగం కాదని మోదీ భావిస్తున్నారేమోనని రాహుల్‌ విమర్శించారు. ఈ యాత్ర తమ గురించి చెప్పేందుకు కాదని, ప్రజల గురించి తెలుసుకునేందుకని రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. భారత్​ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు.

Bharat Jodo Nyay Yatra Rahul Gandhi Speech
Bharat Jodo Nyay Yatra Rahul Gandhi Speech

Bharat Jodo Nyay Yatra Rahul Gandhi Speech :హింస చెలరేగిన మణిపుర్​లో శాంతి, సామరస్యాలను నెలకొల్పుతామని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ వాగ్దానం చేశారు. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు వారి బాధలు వినేందుకే తాము భారత్​ జోడో న్యాయ్‌ యాత్ర చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజల మాట వినేందుకు వారితో మమేకమయ్యేందుకు తనకు మరో అవకాశం లభించిందని రాహుల్‌ గాంధీ అన్నారు. మణిపుర్‌ ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు మోదీ ముందుకు రాలేదని కానీ మణిపుర్ ప్రజల బాధను తాము అర్థం చేసుకున్నామని రాహుల్‌ తెలిపారు.

అల్లర్లతో అట్టుడికిన మణిపుర్‌ను ప్రధాని ఇంతవరకూ సందర్శించలేదని ఈ రాష్ట్రం భారత్‌లో అంతర్భాగం కాదని మోదీ భావిస్తున్నారేమోనని రాహుల్‌ వ్యాఖ్యానించారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ సూత్రాలను పునరుద్ధరింపజేసేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని రాహుల్‌ తెలిపారు. భారత్​ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం సందర్భంగా ఇంఫాల్​లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు.

"భారీగా పెరిగిన నిరుద్యోగిత, విపరీతంగా పెరిగిన ధరల సమస్యలను ప్రస్తుతం దేశం ఎదుర్కొంటోంది. ఇలాంటి సమస్యలను భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో లేవనెత్తుత్తాం. ఈ యాత్ర మా గురించి చెప్పేందుకు కాదు. మీ గురించి తెలుసుకునేందుకు. మేం మా మనసులోని మాటను మీకు చెప్పేందుకు రావడం లేదు. మీ మనసులోని మాటను వినేందుకు వస్తున్నాం. మీ ఇంటి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాం. నేను మిమ్మల్ని కలిసి, మీతో మాట్లాడి ఆ విషయాలను దేశం ముందు పెట్టేందుకు వస్తున్నాను. మరోసారి మీ అందరూ రండి. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ద్వారా రానున్న రోజుల్లో మీ అందరినీ కలిసే అవకాశం.. మాట్లాడే అవకాశం.. కలిసే నడిచే అవకాశం లభించింది. మీ అందరినీ కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది"
--రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత

అంతకుముందు ప్రసంగించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సామాజిక న్యాయం, లౌకికవాదం సమానత్వాన్ని పరిరక్షించేందుకు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర చేపట్టినట్లు తెలిపారు.

మణిపుర్‌ ప్రజలు బాధలో ఉన్నప్పుడు రాని మోదీ ఓట్ల కోసం మాత్రం వస్తారని ఆరోపించారు ఖర్గే. సముద్రం దగ్గర విహరించేందుకు ప్రధానికి సమయం ఉంటుంది కానీ మణిపుర్‌ ప్రజల గోడు వినేందుకు మాత్రం ఖాళీ ఉండదని ఖర్గే మండిపడ్డారు. బీజేపీ మతం, రాజకీయాలను మిళితం చేస్తోందని మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని ఖర్గే మండిపడ్డారు. దేశంలోని పీడితులు బాధితులు ఆదివాసీలు దళితులు బీజేపీ పాలనలో అన్యాయానికి గురయ్యారని వారందరికీ న్యాయం చేసేందుకు వారి గోడు వినేందుకు రాహుల్‌ గాంధీ న్యాయ్‌ యాత్రను చేపట్టారని ఖర్గే తెలిపారు.

"జవహర్‌లాల్‌ నెహ్రూ స్థాపించిన పెద్ద పెద్ద పరిశ్రమలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని మోదీ కొన్నింటిని మూసేస్తూ మరికొన్నింటిని అమ్మేస్తున్నారు. వీటిని ఆపేందుకు మేం ఈ న్యాయ్‌ యాత్రను ప్రారంభించాం. రైతులకు మద్ధతు ధర అందించేందుకు మేం ఈ న్యాయ్‌ యాత్ర చేస్తున్నాం. దేశంలోని మహిళలందరి కోసం, మహిళా రెజ్లర్ల కోసం, అత్యాచారాల నిరోధం కోసం మేం ఈ యాత్రను చేపట్టాం. దేశంలోని పాత్రికేయులకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అందించేందుకు మేం పోరాటం చేస్తున్నాం. ఈ న్యాయ్‌ యాత్ర దేశంలోని పీడితులు, బాధితులు ఆదివాసీలు, దళితులు బీజేపీ పాలనలో అనేక అన్యాయాలకు గురయ్యారు. వారందరి కోసం రాహుల్‌గాంధీ ఈ న్యాయ్‌ యాత్రను చేస్తున్నారు."
--మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు

కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు ముఖ్య నేతల సమక్షంలో మణిపుర్‌ నుంచి ముంబయి వరకు సాగేభారత్‌ జోడో న్యాయ్‌ యాత్రను మణిపుర్​లోని తౌబాల్​లో ఆదివారం మల్లికార్జున ఖర్గే జెండా ఊపి ప్రారంభించారు. రాహుల్‌ యాత్ర చేయనున్న బస్సును కూడా ఖర్గే ప్రారంభించారు. అనంతరం బస్సు ఎక్కిన రాహుల్‌-ఖర్గే ప్రజలకు అభివాదం చేశారు.

రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర మణిపుర్‌ నుంచి ప్రారంభమై ముంబయిలో ముగుస్తుంది. 15 రాష్ట్రాల్లోని 100 లోక్‌సభ నియోజకవర్గాల గుండా భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర సాగుతుంది. ఈ యాత్ర 67 రోజుల్లో 110 జిల్లాలు 100 లోక్‌సభ స్థానాలు 337 శాసనసభ నియోజకవర్గాల్లో సాగుతుందని కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. మణిపుర్‌లో ప్రారంభమైన యాత్ర ముంబయిలో మార్చి 20 లేదా 21 తేదీల్లో ముగుస్తుంది. భారత్ జోడో న్యాయ్ యాత్రలో రోజుకు రెండుసార్లు పౌర సమాజ సభ్యులు, సంస్థలతో రాహుల్‌ గాంధీ మాట్లాడుతారు. పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఘోర ఫలితాల తర్వాత పుంజుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి ఈ యాత్ర ఉపయోగపడుతుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details