Lakshman Rekha CJI N V Ramana: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సదస్సులో సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక అంశాలపై ప్రసంగించారు. న్యాయమూర్తులు విధి నిర్వహణలో తమ పరిమితులను గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. లక్ష్మణ రేఖను దాటొద్దని సూచించారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలకు రాజ్యాంగం వేర్వేరు అధికారాలను కల్పించిందని గుర్తుచేసిన సీజేఐ... ప్రజాస్వామ్య బలోపేతానికి, సామరస్యంగా కార్యకలాపాలు సాగేందుకు ఇది దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దుర్వినియోగం అవుతున్నాయని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి వ్యక్తిగత ప్రయోజన వ్యాజ్యాలుగా మారిపోయాయని ఆవేదనతో చెప్పారు.
కాగా, ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సదస్సు దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రారంభమైంది. ఆరేళ్ల తర్వాత జరుగుతున్న ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 25 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, పలు రాష్ట్రాల న్యాయశాఖ మంత్రులు, అధికారులు విచ్చేశారు. న్యాయమూర్తుల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి తరపున న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు.