Constitution Day 2022 : "ప్రజలు న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కాలని ఆశించడం కాదు.. న్యాయస్థానాలే ప్రజల చెంతకు చేరాలి" అన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టులో శనివారం జరిగిన వేడుకల్లో ఆయన ప్రసంగించారు. దేశంలో ప్రతి ఒక్కరికీ న్యాయవ్యవస్థలు అందుబాటులో ఉండాలని సీజేఐ ఆకాంక్షించారు.
"మనలాంటి వైవిధ్యభరితమైన దేశంలో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సవాల్.. అందరికీ న్యాయం అందుబాటులోకి తీసుకురావడమే. అయితే దీనికోసం మన న్యాయవ్యవస్థ చర్యలు చేపడుతోంది. సుప్రీంకోర్టు దిల్లీలోని తిలక్ మార్గ్‌లో ఉన్నప్పటికీ అది దేశ ప్రజలందరిదీ. సర్వోన్నత న్యాయస్థానంలో వర్చువల్ పద్ధతిని తీసుకొచ్చాం. దేశంలో ఎక్కడినుంచైనా లాయర్లు తమ కేసులను వాదించే వెసులుబాటు కల్పించాం. సాంకేతికత సాయంతో కోర్టు పనితీరును మెరుగుపరుస్తున్నాం" అని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలంటే ప్రాథమిక విధులే మన మొదటి ప్రాధాన్యం కావాలని అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న మన ఆర్థిక వ్యవస్థను చూసి.. యావత్ ప్రపంచం భారత్‌వైపు సాయం కోసం చూస్తోందన్నారు. ఈ సందర్భంగా 2008 ముంబయి పేలుళ్ల ఘటనను గుర్తుచేసుకుని మృతులకు నివాళులర్పించారు. ‘‘2008లో యావత్ భారతావని రాజ్యాంగ దినోత్సవాన్ని చేసుకుంటున్న సమయంలో.. మన శత్రువులు భీకర ఉగ్రదాడికి పాల్పడ్డారు. ఆ చేదు జ్ఞాపకాలను మర్చిపోలేం. ఆ మారణహోమంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నివాళులర్పిస్తున్నా’’ అని మోదీ తెలిపారు.