మహిళలపై తమకు అపారమైన గౌరవం ఉందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. న్యాయవాదుల చేతుల్లోనే న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ ఆధారపడి ఉంటుందని పేర్కొంది. ఇటీవల ఓ అత్యాచారం కేసులో "బాధితురాలిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనా? అలాగైతే బెయిల్ మంజూరును పరిగణనలోకి తీసుకుంటాం. లేదంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. పెళ్లి చేసుకోవాలని మాత్రం మేమేమీ బలవంతం చేయడం లేదు" అని నిందితుడిని ఉద్దేశిస్తూ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించిన క్రమంలో విమర్శలు వచ్చాయి. పలువురు సామాజిక కార్యకర్తలు సీజేఐకి లేఖ రాశారు.
ఈ క్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించింది అత్యున్నత న్యాయస్థానం. తమ వ్యాఖ్యలను తప్పుగా ఆపాదించారని పేర్కొంది. మహిళల పట్ల తమకు అపారమైన గౌరవం ఉందని పేర్కొంది.
26 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతి కోరుతూ అత్యాచార బాధితురాలైన ఓ 14 ఏళ్ల బాలిక వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.