బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల నుంచి పూర్తి మద్దతు తమకే లభించిందన్నారు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్. కానీ, డబ్బు, మోసంతోనే ఎన్డీఏ విజయం సాధించిందని ఆరోపించారు. ప్రజలు నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూను మూడవ స్థానానికి దింపేశారని ఎద్దేవా చేశారు తేజస్వీ. నితీశ్‌కు మనస్సాక్షి అనేది మిగిలి ఉంటే ముఖ్యమంత్రి కుర్చీని వదులుకోవాలని సూచించారు.
మహాకూటమి శాసనసభాపక్ష నేతగా తేజస్వీ యాదవ్‌ను 109 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పట్నాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్డీఏపై విరుచుకుపడ్డారు తేజస్వీ.
" మహాకూటమి కన్నా ఎన్డీఏకు 12,270 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. అయినా వారు మాకన్నా 15 సీట్లు ఎక్కువ గెలుచుకోవడం ఆశ్చర్యకరం. ప్రారంభంలో లెక్కించాల్సిన పోస్టల్ బ్యాలెట్లను చివర్లో లెక్కించటం సరికాదు. అలాంటి వాటిని తిరిగి లెక్కించాలి. చాలా తక్కువ తేడాతో 20 స్థానాలను కోల్పోయాం. చాలా నియోజకవర్గాల్లో దాదాపు 900 వరకు పోస్టల్ బ్యాలెట్లు చెల్లనివిగా తేలాయి."