తూర్పు లద్దాఖ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో బలగాలను వేగంగా ఉపసంహరించుకునేందుకు చైనాతో కలిసి పనిచేస్తున్నట్లు భారత్ తెలిపింది. ఈ మేరకు సైన్యం ద్వైపాక్షిక సంప్రదింపుల ద్వారా త్వరితగతిన బలగాలను వెనక్కి రప్పించేందుకు కృషి చేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ తెలిపారు.
బలగాల ఉపసంహరణకు చైనాతో చర్చలు ముమ్మరం
భారత్, చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణ ప్రక్రియ వేగవంతం కావడానికి ఆ దేశంతో చర్చలు జరుపుతున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. సరిహద్దులో ప్రశాంత వాతావరణం నెలకొనడం వల్ల.. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయన్నారు.
గతవారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడారని చెప్పారు శ్రీవాస్తవ. సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఇరువురు నేతలు చర్చించినట్లు పేర్కొన్నారు. ఇరు దేశాల సీనియర్ కమాండర్ల పరస్పర సంప్రదింపులతో మిగిలిన ప్రాంతాల్లోని బలగాలను వేగంగా వెనక్కి రప్పిస్తామని ఆయన చెప్పారు. సరిహద్దుల్లో నెలకొనే ప్రశాంత వాతావరణం.. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందన్నారు అనురాగ్.
గత నెల.. ఇరుదేశాల సైన్యాధికారుల మధ్య జరిగిన 10వ రౌండ్ సమావేశంలో సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ వేగవంతం చేసేందుకు అంగీకారం కుదిరింది.
ఇదీ చదవండి:'చైనా, పాక్ ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి'