Army Chief On Future Conflicts: సరిహద్దులో వివాదాల నేపథ్యంలో భారత సైనిక దళాధిపతి ఎం.ఎం.నరవణె కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో శత్రుదేశాలతో ముప్పు పొంచి ఉందని వెల్లడించారు. అందుకు సంబంధించి ప్రస్తుతం ట్రైలర్లను చూస్తున్నామని తెలిపారు.
"భవిష్యత్తులో భారత్ ఎదుర్కోనున్న సంఘర్షణలను ట్రైలర్ల రూపంలో చూస్తున్నాం. ఉత్తర సరిహద్దులో ఏర్పడ్డ పరిస్థితులు.. మనకు మరింత సమర్థమైన సైన్యం కావాలన్న అవసరాన్ని గుర్తుచేశాయి. అందువల్ల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సైన్యం పునర్‌వ్యవస్థీకరణపై ఇప్పటికే దృష్టి సారించాం."
-- ఎం.ఎం.నరవణె, భారత సైనిక దళాధిపతి
చైనా, పాక్ పేర్లను ప్రత్యక్షంగా ప్రస్తావించకుండానే రానున్న రోజుల్లో వినూత్నమైన భద్రతా సవాళ్లను భారత్ ఎదుర్కొంటోందని చెప్పారు. 2020లో తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనా సైనికుల ఘర్షణను గుర్తుచేసిన నరవణె.. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖాముఖి పోరు సహా అన్ని రకాలుగా శత్రువుపై పోరాడగల సామర్థ్యాన్ని పెంపొందుంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
అఫ్గానిస్థాన్‌లో పరిణామాలను ఉపయోగించుకుని శత్రుదేశాలు.. భారత్‌కు వ్యతిరేకంగా తమ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని నరవణె అన్నారు. కొన్నిదేశాలు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన నిబంధనలను కూడా సవాలు చేస్తూ.. దూకుడుగా వ్యవహరిస్తున్నాయని సరిహద్దులో చైనా చర్యలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి:మంత్రిపై దాడికి యత్నం.. పదునైన ఆయుధం, విషంతో...