కరోనా పోరులో చివరి దశకు చేరుకున్నామని కేంద్ర వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. ఈ దశలో విజయం సాధించాలంటే రాజకీయాలను టీకా పంపిణీ నుంచి దూరంగా ఉంచాలని కోరారు. టీకా అభివృద్ధి వెనక ఉన్న శాస్త్రీయతపై ప్రజలు నమ్మకం ఉంచాలని అన్నారు. తమ సన్నిహితులందరూ వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలని పిలుపునిచ్చారు.
ఆదివారం దిల్లీ మెడికల్ అసోసియేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. దేశంలో ఇప్పటివరకు 2 కోట్లకు పైగా టీకా డోసులను అందించినట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ రేటు రోజుకు 15 లక్షల డోసులు అందించే స్థాయికి చేరిందని చెప్పారు. ఇతర దేశాల్లా కాకుండా టీకా సరఫరా విషయంలో భారత్‌కు ఇబ్బందులు లేవని అన్నారు. టీకా జాతీయవాదాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రపంచదేశాల్లో మహమ్మారి వ్యాప్తి కొనసాగితే.. భారత్ కరోనా నుంచి సురక్షితంగా ఉండలేదని అన్నారు.
"కొవిడ్ మహమ్మారి అంతిమ దశలో ఉన్నాం. ఈ దశలో విజయం సాధించాలంటే మనం మూడు అంశాలను పాటించాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ నుంచి రాజకీయాలను దూరంగా ఉంచాలి. టీకా అభివృద్ధి వెనక ఉన్న సైన్స్‌ను విశ్వసించాలి. మన సన్నిహితులంతా సరైన సమయంలో టీకా తీసుకునేలా చూడాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ టీకా అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అవసరమైతే వారు కూడా రోజుకు 24 గంటలు టీకా అందించవచ్చు. అర్హులైన వారందరూ తప్పకుండా వ్యాక్సిన్ స్వీకరించాలని కోరుతున్నా."
-హర్షవర్ధన్, కేంద్ర వైద్య శాఖ మంత్రి