Yati Narsinghanand Sarswati: జునా అఖారా కీలక సభ్యుడు, డస్నా మందిర్ ఆలయ ప్రధాన పూజారి యతి నరసింహానంద్ సరస్వతి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మనమంతా హిందువులమని, హిందుస్థానీలం కాదని పేర్కొన్నారు. దేశంలోని ఆలయాలను కాపాడుకోవాలంటే హిందువులంతా ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉండాలన్నారు. అప్పుడే మనల్ని మనం కాపాడుకోగలమని చెప్పారు. అలీగఢ్‌లో హనుమాన్ మందిరం ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన.. పలు వ్యాఖ్యలు చేశారు.
" ఒక్కరు లేదా ఇద్దర్నే కనాలనే కొత్త సంప్రదాయాన్ని ఆపాలి. హిందువుల జనాభా పెరగాలి. పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో కేవలం ముస్లింల జనాభానే పెరుగుతోంది. మిగతా మతాల జనాభా తగ్గుతోంది. అందుకే ప్రతి ఇంట్లో కచ్చితంగా ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఉండాలి. లేకపోతే ఆ దేవుడు కూడా మనల్ని కాపాడలేడు. మనమంతా హిందువులం, హిందుస్థానీలం కాదు."