ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ దూకుడు పెంచారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఫలితాలు దక్కించుకున్న తరుణంలో ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. రానున్న బంగాల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. తాజాగా.. గుజరాత్‌పైనా పట్టు సాధించేందుకు చర్యలు చేపట్టారు. గుజరాత్ స్థానిక ఎన్నికల్లో భారతీయ ట్రైబల్ పార్టీతో పొత్తు కుదుర్చుకుని బరిలో దిగనున్నారు.
ఎన్నికల ప్రచారాల్లో భాగంగా శనివారం గుజరాత్‌లోని సూరత్ చేరుకున్నారు ఓవైసీ. ఆయనకు మద్దతుదారుల నుంచి ఘన స్వాగతం లభించింది. గుజరాత్ ప్రజల మనసు గెలుచుకునేందుకే తాను అహ్మదాబాద్‌కు వచ్చానని వ్యాఖ్యానించారు.
"గుజరాత్ ప్రజల మనసు గెలుచుకునేందుకే నేను ఇక్కడి వచ్చాను. అందుకోసం మా పార్టీ నిరంతరం శ్రమిస్తుంది. అయితే.. భాజపాపై గెలిచేందుకే మేము ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ఊహాగానాలు జోరందుకున్నాయి. వాటిల్లో నిజం లేదు. నేను భారత రాజకీయాలకు అభిమానిని. పోటీ చేసే హక్కు అందరికీ ఉంది."