Family beaten up forced to drink urine: బంగాల్ ముర్షీదాబాద్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. రఘునాథ్గంజ్ ప్రాంతంలోని మథురాపుర్లో చేతబడి చేస్తున్నారనే నెపంతో ఓ కుటుంబాన్ని చితకబాదారు స్థానికులు. అనంతరం వారి చేత మూత్రం తాగించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడం వల్ల పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అంతకుముందు.. గురువారం ఉదయం కూడా ఇటువంటి ఘటనే వెలుగుచూసింది. దక్షిణ్ దినాజ్‌పుర్ జిల్లాకు చెందిన లక్ష్మీరామ్ హెమ్బ్రమ్ అనే వ్యక్తిని చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో పలువురు దుండగులు హత్య చేశారు. అనారోగ్యం వల్ల ఎక్కువ కాలం బతకలేకపోవచ్చని పక్కింట్లో ఉండే ఫాగు బస్కే అనే వ్యక్తికి జోస్యం చెప్పడమే కారణం. హెమ్బ్రమ్ జోస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫాగు బస్కే కుమారుడు.. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో మరికొందరితో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు.
అసంతృప్తితో భర్తను హతమార్చిన భార్య:ప్రియుడు, మరో వ్యక్తితో కలిసి భర్తను హత్య చేసిన మహిళను అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటన సెంట్రల్ దిల్లీలోని దర్యాగంజ్‌లో జరిగింది. నిందితులను జీబా ఖురేషీ (40), షోయబ్ (29), వినీత్ గోస్వామి (29)గా గుర్తించారు పోలీసులు. భర్త మొయినుద్దీన్ ఖురేషీని మే17న రాత్రి 10 గంటలకు ఆరుబయట మూత్రం చేస్తున్న సమయంలో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.
"భర్తతో సంతోషంగా లేని కారణంగా అతడిని వదిలించుకొని వేరొకని వివాహం చేసుకోవాలని జీబా భావించేది. ఈ క్రమంలోనే రెండేళ్ల కింద ఫేస్బుక్లో షోయబ్‌తో పరిచమైంది. తనను పెళ్లి చేసుకోమని, అడ్డుగా ఉన్న భర్తను చంపాలని అతడిని ఒప్పించింది. 5నెలల పాటు ప్లాన్ చేసి హత్య కోసం గోస్వామితో రూ.6 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు" అని పోలీసులకు వివరించారు.