మధ్యప్రదేశ్ దిండోరి జిల్లాలోని గూసియా గ్రామ ప్రజలు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. బిందెడు నీటి కోసం.. తమ ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు. గూసియా గ్రామంలో బోర్లు ఉన్నప్పటికీ.. అందులో నీరు లేదు. ఉన్న 3 బావులే వారికి ఆధారం. ఆ మూడుబావులు ఎండిపోయే పరిస్థితికి రాగా.. ఉన్న కొద్దిపాటి నీటికోసమే రోజూ ప్రాణాలకు తెగించి సాహసాలు చేస్తున్నారు.
నీటికోసం కొన్నిసార్లు ఎలాంటి తాడు సాయం లేకుండా బావిలోకి దిగాల్సి వస్తోంది. ఈ క్రమంలో కొన్నిసార్లు గాయాలపాలవుతున్నారు. మహిళలు, పిల్లలు నీటికోసం ప్రమాదకర రీతిలో బావిలోకి దిగుతున్న దృశ్యాలు అక్కడి గ్రామవాసుల దుస్థితికి అద్దంపడుతున్నాయి. కొన్నిసార్లు ఆ బావుల్లో కూడా గుక్కెడు నీరు కూడా ఉండదని గూసియా గ్రామస్థులు వాపోతున్నారు. దొరికిన నీరు కూడా మట్టితోనే కూడి ఉంటుందని, వాటినే జాగ్రత్తగా వాడుకుంటున్నామని చెబుతున్నారు. అవి కూడా ఎండిపోతే ఇక నీటి కోసం ఎక్కడకు వెళ్లాలో కూడా తెలియట్లేదని వాపోతున్నారు. ఎన్నికల సమయంలో.. వచ్చే నాయకులు, అధికారులు.. మిగతా సమయంలో తమ గోడు వినేందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటిసమస్యను తీర్చేవరకూ ఈసారి ఓట్లు వేయమని స్పష్టం చేస్తున్నారు.