Waste Water Trading : వృథాగా వెళ్లే నీటిని మార్కెట్‌లో వినియోగ వస్తువుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సంబంధిత విధాన రూపకల్పనపై నీతి ఆయోగ్ కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌ల్లో బంగారం, వెండి, ముడిచమురును విక్రయిస్తున్నట్లుగానే వృథా నీటి వ్యాపారం కూడా ప్రారంభిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు కార్యరూపం ఇచ్చే పనికి నీతి ఆయోగ్ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మహారాష్ట్రలో ఈ విధానం ఉండగా దాన్ని దేశవ్యాప్తంగా అమలుచేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు అనుసరిస్తున్న కొలమానాలపై అధ్యయన ప్రక్రియను ప్రారంభించింది.
నీటి వనరులను కొనడం, అమ్మడం, లీజుకివ్వడం ఈ విధానంలోని ప్రధాన ఉద్దేశం. ఈ వ్యాపారాన్ని తాత్కాలిక, శాశ్వత విభాగాలుగా విభజించొచ్చు. శాశ్వత విభాగంలోని వారు తమకున్న హక్కులను పూర్తిగా విక్రయించి ఎక్స్‌క్లూజివ్‌గా నీటిని వాడుకునే హక్కును అవతలి పార్టీకి ఇస్తారు. తాత్కాలిక పద్ధతిలో వ్యాపారం చేసేవారు వార్షిక ప్రాతిపదికన నీటి హక్కులను కేటాయిస్తారు. నానాటికీ జల వనరుల కొరత తీవ్రమవుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో నీటి మార్కెట్ అభివృద్ధి చెందడానికి వీలుంది. డిమాండ్, సరఫరా మధ్య ఉన్న వ్యత్యాసంపై ఆ మార్కెట్ ధరలు ఆధారపడి ఉంటాయి.