Ghulam Nabi Azad on Congress : కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కొన్నిరోజుల తర్వాత గులాం నబీ ఆజాద్.. గాంధీ కుటుంబంపై మరోసారి విరుచుకుపడ్డారు. జీ-23 నేతల్లో ఉన్న తాను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసినప్పటి నుంచే పార్టీలో తనను టార్గెట్ చేశారన్నారు. అయితే ఇప్పుడు తన రాజీనామాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సాకుగా చూపుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బలవంతంగా బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు.
'పార్టీకి డాక్టర్లు బదులు కాంపౌండర్లు చికిత్స చేస్తున్నారు'
కాంగ్రెస్ పార్టీకి అత్యవసరంగా ఔషధాలు అవసరమని గులాం నబీ ఆజాద్ అన్నారు. అయితే పార్టీకి డాక్టర్లకు బదులుగా కాంపౌండర్లు వైద్యం అందిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పార్టీలో సంస్థాగత మార్పులు చేయడానికి నాయకత్వానికి సమయం లేదని విమర్శించారు. రాష్ట్రాల్లో ఉన్న పార్టీ నాయకులను ఏకం చేయకుండా, వారు పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ పునాదులు చాలా బలహీనపడ్డాయని, ఏ క్షణమైనా వ్యవస్థ మొత్తం శిథిలం కావచ్చని జోస్యం చెప్పారు. అందుకే కొంతమంది నాయకులతో కలిసి పార్టీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.
"కాంగ్రెస్ పార్టీలో కొందరు స్వార్థపరులు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఎందుకంటే తమకు ఎవ్వరూ లేఖలు రాయకూడదని, ఎవ్వరూ ప్రశ్నించకూడదని వారు అనుకున్నారు. పార్టీలో అనేక సమావేశాలు జరిగాయి. కానీ వాళ్లు ఒక్క సూచన కూడా తీసుకోలేదు. నేను భాజపాలో చేరను. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉన్నందున త్వరలోనే జమ్ముకశ్మీర్లో కొత్త పార్టీ పెడతాను."