తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Warangal Rains 2023 : వాన దంచికొట్టింది.. ఓరుగల్లును వరద ముంచెత్తింది - వరంగల్​లో నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు

Warangal Heavy Rains : రెండ్రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు ఓరుగల్లు నగరం తడిసిముద్దైంది. కుంటలు, చెరువులు పూర్తిగా నిండుకున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చెరువులు అలుగు పారుతున్నాయి. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి.. రవాణా సేవలు నిలిచిపోయాయి. ఇప్పటికీ కొన్ని లోతట్టు ప్రాంతాలు, కాలనీలు వరదలో చిక్కుకోవడంతో ముంపువాసులు ఆందోళన చెందుతున్నారు.

Warangal Rains 2023
Warangal Rains 2023

By

Published : Jul 26, 2023, 8:17 AM IST

ఉమ్మడి వరంగల్​ను మంచెత్తిన వరద.. ముంపులోనే లోతట్టు ప్రాంతాలు, కాలనీలు

Heavy Rains in Warangal :ఎడతెరిపి లేకుండా కురుస్తున్భారీ వర్షాలకు వరంగల్‌లోని పలు కాలనీలు నీట మునిగాయి. హంటర్ రోడ్డులోని బూందివాగు పొంగడంతో.. సంతోషిమాతనగర్, ఎన్టీఆర్ నగర్, గణేశ్ నగర్ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నీటిలో చిక్కుకున్న వారికోసం వరంగల్-హనుమకొండ నగరాల్లో 8 పునరావాస కేంద్రాల్ని మహానగర పాలకసంస్థ ఏర్పాటు చేసింది. వివేకానంద కాలనీ, ఎస్సార్ నగర్, సుందరయ్య నగర్, డీకే నగర్, పూర్తిగా నీట మునగడంతో కాలనీవాసులకు ఇబ్బందులు తప్పలేదు. ఇళ్లలోకి వరద నీరు రావడంతో నిత్యావసర సరుకులు తడిసి ముద్దయ్యాయని బాధితులు వాపోయారు. కాలనీవాసులను విపత్తు నిర్వహణ సిబ్బంది ప్రత్యేక పడవల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలించారు.

Warangal Rains Today 2023 : వరంగల్ జిల్లాలోని నర్సంపేట డివిజన్‌ వరుస వర్షాలకి చెరువులు, కుంటలు అలుగులు పారడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. కొత్తపల్లి వైపు వెళ్లే బుర్కపల్లి వాగు పొంగడంతో.. రాకపోకలు నిలిచిపోయాయి. వేలుబెల్లి కతర్లవాగు పొంగిపొర్లుతుంది. నర్సంపేట నుంచి కొత్తగూడ వైపు వెళ్లే దారిలో గాదెవాగు గుంజేడు తోగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మొండ్రాయిగూడెం వాగు పొంగిప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గాంధీనగర్‌లో నరసమ్మ అనే వృద్ధురాలి ఇల్లు కూలింది. గూడూరు మండలం కొమ్ములవంచ శివారు బీముని పాదం జలపాతం బారీ వర్షాలకుఉద్ధృతంగా జాలువారుతుంది. పర్యాటకులను జలపాత సందర్శనానికి రాకూడదని అటవీ అధికారుల హెచ్చరిక బోర్డులు పెట్టారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు నిండి మత్తడిపోస్తున్నాయి.

Warangal Heavy Rains :వర్ధన్నపేట వద్ద ఆకేరువాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. వాగు ఉద్ధృతికి మిషన్ భగీరథ పైపులైన్ పగిలిపోయింది. తహసీల్దార్‌ కార్యాలయం, ప్రాథమికోన్నత పాఠశాల.. పోలీస్‌స్టేషన్‌ని వరద చుట్టుముట్టింది. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై 6 అడుగుల మేర వరద నీరు ప్రవహించింది. కర్రలోడ్‌తో వెళ్తున్న ఓలారీ నీటిలో చిక్కుకోగా డ్రైవర్, క్లీనర్‌ ప్రాణాలతో బయటపడ్డారు. 6 గంటల పాటు వాహనదారులు.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీ గ్రామాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో.. ఓ వ్యక్తి చేపల వేటకు వెళ్లి వాగులో గల్లంతయ్యాడు. బోధపురం గ్రామపంచాయతీ సీతారాంపురం గ్రామానికి చెందిన బొగ్గుల బండిగా... పోలీసులు గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. ఎగువన కురిసిన వర్షాలకు కుంటలు, చెరువులు మత్తడులు దూకి.. రామప్ప సరస్సులోకి చేరుతున్నాయి. చేపలు వరద నీటికి ఎదురెక్కడంతో జంగాలపల్లి, ఇంచర్ల, ములుగు, బరిగలపల్లి మత్స్యకారులు, యువకులు చేపలు పట్టారు.

లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలి : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం శివారులోని ఆకేరువాగు వరద ఉద్ధృతిని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పరిశీలించారు. వరద పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కుండపోత వర్షాలతో ఇళ్లలోకి నీరు చేరి నిరాశ్రయులైన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు వరదల వల్ల ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details