CP Ranganath on Bandi Sanjay Arrest : రాష్ట్రవ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న పదో తరగతి ప్రశ్నపత్రం కేసులో వరంగల్ సీపీ రంగనాథ్ పలు ఆశ్చర్యపోయే విషయాలు వెల్లడించారు. కమలాపూర్ ప్రభుత్వ పాఠశాల నుంచి బయటకు వచ్చిన పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఏ1 నిందితుడిగా కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రంగనాథ్.. కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం కేసులో బండి సంజయ్ ఏ1, బూరా ప్రశాంత్ (మాజీ జర్నలిస్టు) ఏ2, గుండబోయిన మహేశ్ ఏ3 (కేఎంసీలో ల్యాబ్ అసిస్టెంట్), మైనర్ బాలుడు ఏ4, శివగణేశ్ ఏ5ని అరెస్టు చేసి కోర్టుకు తరలించామని రంగనాథ్ వెల్లడించారు. బూర ప్రశాంత్‌ను మంగళవారమే అరెస్టు చేశామన్నారు. కమలాపూర్ ప్రభుత్వ పాఠశాల నుంచే ప్రశ్నపత్రం బయటకు తెచ్చినట్టు దర్యాప్తులో తేలిందన్నారు. అదే విధంగా బండి సంజయ్‌పై 120బి, 420, 447, 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు పరీక్ష కేంద్రానికి బాధ్యులపైన శాఖపరమైన చర్యలు తీసుకున్నారని సీపీ రంగనాథ్ వివరించారు.
ప్రశాంత్ జర్నలిస్టు కాదు : ఒక జర్నలిస్టు తన విధుల్లో భాగంగా అప్పటికే వివిధ గ్రూపుల్లో వచ్చిన ప్రశ్న పత్రాన్ని హైదరాబాద్‌లో ఉన్న మీడియా హెడ్స్‌కి 11.18 నిమిషాలకు ఫార్వర్డ్ చేశారని సీపీ రంగనాథ్ తెలిపారు. 11.20 నిమిషాలకు బూర ప్రశాంత్ బండి సంజయ్‌కు వాట్సప్‌లో పంపారన్న ఆయన... ప్రశాంత్ ప్రస్తుతం జర్నలిస్టుగా పనిచేయడం లేదన్నారు. చాలా మందికి ప్రశ్న పత్రాన్ని ప్రశాంత్ ఫార్వర్డ్ చేశాడని రంగనాథ్ పేర్కొన్నారు. ఇతనితో పాటు మహేశ్ కూడా చాలా మందికి పంపాడన్న సీపీ.. బండి సంజయ్‌కు ప్రశాంత్‌తో పాటు మహేశ్ కూడా పంపించాడని దర్యాప్తులో తేలిందన్నారు. బండి సంజయ్‌కే కాదు ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఆయన పీఏ రాజుతో పాటు పలువురు బీజేపీ నేతలకు కూడా ప్రశ్నపత్రం పంపారని సీపీ రంగనాథ్ వెల్లడించారు.
'పిల్లల సహాయంతో ప్రశ్నపత్రం బయటకు తెప్పించుకున్నారు. కొన్ని మొబైల్స్‌లో మెసేజ్‌లు డిలీట్ చేశారు. వాటిని రిట్రీట్ చేయాలి. కాల్ డేటా సేకరించాల్సి ఉంది. కమలాపూర్ నుంచే ప్రశ్నపత్రాలు బయటకు ఎందుకు వస్తున్నాయి. మొత్తం ప్రశ్నపత్రాల లీక్ జరుగుతోందనే ప్రచారం జరిగేలా కుట్ర కనిపిస్తోంది. సెక్షన్ 41 ప్రకారం వారంట్ లేకుండానే అరెస్టు చేయొచ్చు. కక్ష పూరితంగా బండి సంజయ్‌ను అరెస్టు చేశారనేది అవాస్తవం. ఎంపీ సంజయ్ అరెస్టుపై లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇచ్చాం. మైనర్లను జువైనల్ కోర్టుకు పంపించాం.'-రంగనాథ్, వరంగల్ సీపీ