Wang Yi India Visit: వాస్తవాదీన రేఖ ప్రాంతాల్లో ఉన్న సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియను అన్ని ప్రాంతాల్లో కొనసాగించాలని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీను కోరారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్. దౌత్య, సైనిక స్థాయిలో సానుకూల చర్చల ప్రక్రియ కొనసాగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకు ఉన్న అడ్డంకులను తొలగించాలని పేర్కొన్నారు. ఇరు దేశాలు చేపట్టే చర్యలు సమాన, పరస్పర భద్రతా స్ఫూర్తిని ఉల్లంఘించకుండా చూసుకోవాలని దిల్లీలో జరిగిన భేటీలో ఏకాభిప్రాయానికి వచ్చారు.
తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వివాదంతో సంబంధాలు క్షీణించిన వేళ భారత్, చైనా మధ్య రెండేళ్ల తర్వాత ఈ కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. భారత పర్యటనకు వచ్చిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో శుక్రవారం సమావేశమయ్యారు. తూర్పు లద్దాఖ్ వివాదం సహా ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చించారు. ప్రత్యేక ప్రతినిధి స్థాయిలో చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు చైనాలో పర్యటించాలని అజిత్ డోభాల్‌ను ఆహ్వానించారు వాంగ్ యీ.