తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భూతాపంతో ద్వీపాలకు ముప్పు- నిర్లక్ష్యానికి తప్పదు మూల్యం' - Venkaiah Naidu visit kerala

VP Venkaiah Naidu Visit Lakshadweep: ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచితేనే.. ద్వీపాల అద్భుత అందాలను రక్షించుకోగలమని హెచ్చరించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రెండురోజుల లక్షద్వీప్‌ పర్యటన ముగించుకున్న సందర్భంగా అక్కడి అనుభవాలను తన ఫేస్‌బుక్‌ పేజీలో పంచుకున్నారు.

venkaiah naidu kochi
వెంకయ్యనాయుడు

By

Published : Jan 3, 2022, 6:53 AM IST

VP Venkaiah Naidu Visit Lakshadweep: భూతాపంతో ద్వీపాలకు ముప్పు పొంచి ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హెచ్చరించారు. రెండురోజుల లక్షద్వీప్‌ పర్యటన ముగించుకున్న సందర్భంగా అక్కడి అనుభవాలను ఆయన తన ఫేస్‌బుక్‌ పేజీలో పంచుకున్నారు. "ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచాలి. అప్పుడే ద్వీపాల అద్భుత అందాలను రక్షించుకోగలం. చిన్న ద్వీపాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాల శాతం చాలా తక్కువ. కానీ అవి పెద్ద దేశాల నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. సముద్రమట్టాల పెరుగుదల, తుపాన్లు, వరదలు, తీరప్రాంత కోతలు ద్వీపాల్లో నివసించేవారికి పెను ముప్పుగా పరిణమించాయి. ఇలాంటి చోట్ల పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూనే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. పర్యాటకులు స్థానిక ప్రజల బాగోగులను, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని మసలుకోవాలి. పర్యాటక పరంగా భారత్‌ అత్యుత్తమ గమ్యస్థానంగా ఉంది. హిమాలయాలు, రాజస్థాన్‌లోని మానవ నిర్మిత అద్భుత కట్టడాలు, హిమాచల్‌ప్రదేశ్‌లోని స్వచ్ఛమైన సరస్సులు, ఉత్తరాఖండ్‌లోని ఆధ్యాత్మిక స్థలాలు, గోవాలోని బీచ్‌లు... ఇలా అన్నీ అతుల్యమైన పర్యాటక ప్రాంతాలే. దేశంలోని ప్రతి ఒక్కరూ భారతీయ పర్యాటక స్థలాల అందాలను ఆస్వాదించాలి. అయితే పర్యటనల సమయంలో పర్యావరణానికి నష్టం కలిగించకూడదనిగుర్తుంచుకోవాలి" అని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.

ఐఏసీ విక్రాంత్‌ సందర్శన

Venkaiah Naidu Visit Vikrant: కేరళలోని కొచ్చి షిప్‌యార్డ్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధవాహక నౌక(ఐఏసీ) విక్రాంత్‌ను ఆదివారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించారు. ఆయనతోపాటు కేరళ గవర్నర్‌ అరిఫ్‌ మహమ్మద్‌, రాష్ట్ర పరిశ్రమల మంత్రి పి.రాజీవ్‌, సదరన్‌ నావల్‌ కమాండ్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ రియర్‌ అడ్మిరల్‌ ఆంటోనీ జార్జ్‌ తదితరులు ఉన్నారు. సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మధు ఎస్‌.నాయర్‌ స్వదేశీ పరిజ్ఞాన సాంకేతికతల రూపకల్పనలో కొచ్చి షిప్‌యార్డ్‌ పాత్ర గురించి ఉపరాష్ట్రపతికి తెలిపారు. ఐఏసీ విక్రాంత్‌ ప్రత్యేకతలను నేవీ అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం నావల్‌ ఫిజికల్‌ అండ్‌ ఓషనోగ్రాఫిక్‌ లేబొరేటరీ 70వ వార్షికోత్సవాలను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. అదే ప్రాంగణంలో అబ్దుల్‌ కలాం స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు. వర్చువల్‌ విధానంలో అర్రే ఇంటిగ్రేషన్‌ ఫెసిలిటీకి శంకుస్థాపన చేశారు.

ఇదీ చదవండి:కాంట్రాక్ట్​ వర్కర్ల నిరసన హింసాత్మకం- 20 మంది పోలీసులకు గాయాలు

ABOUT THE AUTHOR

...view details