President poll 2022: రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఉదయం 10గం.లకు ప్రారంభం అయిన ఓటింగ్ సాయంత్రం 5గం.లకు ముగిసింది. మొత్తం ఏడు గంటల పాటు కొనసాగిన ఈ పోలింగ్‌లో.. 98.90 శాతం ఓట్లు పడ్డాయి. ఎనిమిది మంది ఎంపీలు వివిధ కారణాల వల్ల ఓటు వేయలేకపోయారు. పోలింగ్ కోసం వివిధ రాష్ట్రాలకు పంపించిన బ్యాలెట్ బాక్సులు సోమవారం రాత్రి లోపు పార్లమెంటుకు చేరుకోనున్నాయి. వాయు, రోడ్డు మార్గాల్లో బ్యాలెట్ పెట్టెలను దిల్లీకి తరలిస్తున్నట్లు రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ వెల్లడించారు. బ్యాలెట్ బాక్సులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షణలో ఉంటాయని తెలిపారు.
- మొత్తం 736 చట్టసభ్యులకు (727 ఎంపీలు, 9మంది ఎమ్మెల్యేలు) పార్లమెంట్లో ఓటేసేందుకు ఎన్నికల సంఘం అనుమతించింది.
- అందులో 728 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 8 మంది ఎంపీలు వివిధ కారణాల వల్ల ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు.
- మొత్తం 98.90 శాతం ఓటింగ్ నమోదైంది.
పార్లమెంటు భవనంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో తొలుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటేశారు. అనంతరం కేంద్రమంత్రులు, ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా చివరి ఓటు వేశారు. కొవిడ్‌తో బాధపడుతున్నప్పటికీ కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ఆర్కే సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పీపీఈ కిట్ ధరించి పార్లమెంట్‌కు ఓటేసేందుకు వచ్చారు. మరోవైపు, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం సైతం పీపీఈ కిట్‌లో అసెంబ్లీకి వెళ్లి ఓటేశారు.